
సాక్షి, కోల్‌కత్తా : భార్య హసీన్ జహాన్ చేస్తున్న సంచలన ఆరోపణలతో టీమిండియా పేసర్ షమీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిన షమీ తేరుకునే అవకాశం లేకుండా రోజుకో విషయాన్ని బయటపెడుతున్నారు హసీన్. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ, అతను మ్యాచ్ ఫిక్సర్ అంటూ ఆరోపణలు చేసిన హసీన్ తాజాగా మరో బాంబు పేల్చారు. షమీ వద్ద ఉన్న సెల్‌ఫోన్ గనుక తాను తీసుకుని ఉండకపోతే అతను ఉత్తరప్రదేశ్‌కు పారిపోయి తప్పించుకునే మార్గాల కోసం అన్వేషించేవాడని ఆరోపించారు.
ఆ మొబైల్‌లోనే తన భర్త దోషి అని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలున్నాయని, అందుకే షమీ నోరు విప్పటం లేదని తెలిపారు. తన నివాసంలో వుమన్ గ్రీవెన్స్ సెల్‌తో సమావేశమైన హసీన్ తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. షమీ, అతని కుటుంబ సభ్యులు తనని మానసికంగా, శారీరకంగా హింసించారని, షమీకి ఎంతో మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని వాంగ్మూలంలో ఆరోపించారు. ‘తన తప్పును ఒప్పుకొని ఇకనైనా మారాలని ఎన్నోసార్లు చెప్పి చూశాను. కానీ అతను మారలేదు. ఇప్పుడు కూడా తనకు సంబంధించిన మొబైల్ నా దగ్గర ఉందన్న ఒకే ఒక కారణం చేత విడాకులిచ్చే సాహసం చేయలేకపోయాడు’ అని విలేకరులతో తెలిపారు.
తనపై వస్తున్నవన్నీ కేవలం ఆరోపణలేనని వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ మీడియా కూడా అతన్ని ఏమీచేయలేక పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాని, అతను తప్పులు అంగీకరించినట్లయితే మరో అవకాశం ఇస్తానని తెలిపారు.
మరోవైపు షమీ ఎఎన్‌ఐతో మాట్లాడుతూ తనపై కుట్ర జరుగతోందని, తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాలనుకోవడంలేదని, విచారణకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. విచారణను వేగవంతం చేయాలని కోరారు. దీనిపై జహాన్ స్పందిస్తూ.. నిజానిజాలేమిటో విచారణలో నిగ్గు తేలతాయని పేర్కొన్నారు. తాను చేసిన ఆరోపణలతో పాటు ఫిర‍్యాదుకు కట్టుబడి ఉన్నట్లు ఆమె మరోసారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment