వార్న్.. మళ్లీ ఒంటరి !
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్ మళ్లీ ఒంటరివాడయ్యాడు. బ్రిటిష్ మోడల్, నటి ఎలిజబెత్ హార్లీతో మూడేళ్ల బంధాన్ని తెంచుకున్నాడు. ఓ ఆస్ట్రేలియా టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్న్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. ‘మేమిద్దరం విడిపోయాం. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. మా మధ్య ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేకపోయినా మంచి స్నేహితులం. మేం ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలుసుకుంటాం’ అని చెప్పాడు. 2010లో భార్య సైమోన్‌కు విడాకులిచ్చిన తర్వాత వార్న్, హార్లీతో ప్రేమాయణం నడిపాడు.
ఆ తర్వాత ఇద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి వరకు రాలేకపోయారు. మరోవైపు బ్రిటిష్ మోడల్ మిచెల్లీ మోన్‌తో డేటింగ్ వార్తలపైనా వార్న్ స్పందించాడు. ’నేను ఇప్పుడు ఒంటరిని. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. ’ అని ఈ మాజీ స్పిన్నర్ స్పష్టం చేశాడు.