
ఎంఎస్ ధోని (ఫైల్ ఫొటో)
పుణే : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా కనిపిస్తాడు. ఈ ప్రశాంతతోనే ధోని సారథిగా ఎన్నో విజయాలందించాడు. అయితే ఈ ప్రశాంతత వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ధోని సహచర ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ మీడియాతో పంచుకున్నాడు. పుష్టిగా తినడం, కంటి నిండా నిద్రపోవడమే ధోని విజయ రహస్యమని ఈ ఆసీస్ ఆటగాడు చెప్పుకొచ్చాడు.
సోమవారం ఢిల్లీడేర్ డెవిల్స్‌పై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ ధోని తినడం మనం చూడలేము. మధ్యాహ్నభోజనమైనా..అల్పహారమైనా ఒకేలా చాలా ఎక్కువగా తింటాడు. అతనికి నింద్రంటే అమితమైన ప్రేమ. ధోనితో కలిసి ఆడటం మాకు దక్కిన ప్రత్యేక హక్కు. సీఎస్‌కేకు ఆడటమంటేనే ప్రతి ఒక్కరు ధోనితో ఆడినట్టేనని’ వాట్సన్ తెలిపాడు.
ధోని హిట్టింగ్ సూపర్..
ధోని బంతిని హిట్ చేసే విధానం బాగుంటుందని, అతను ఓ అద్భుతమైన ఆటగాడని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ‘ ధోని బంతిని హిట్ చేసే విధానం బాగుంటుంది. అతనో అద్బుత ఆటగాడు. అతను ఆడే షాట్‌లు అన్ని రకాల వికెట్‌పై, అందరి బౌలింగ్‌లో ఆడుతాడు. ఒత్తిడిలో సైతం అతను ప్రశాంతంగా ఉంటాడు. ఎవరి బౌలింగ్‌లో రన్‌రేట్‌ను పెంచే అవకాశం ఉంటుందోనని సరిగ్గా అంచనా వేస్తాడు. అతను ప్రశాంతంగా ఉండటం అత్యద్బుతం. గత కొద్దిరోజులుగా ధోని దగ్గరగా ఉంటూ అతని గురించి తెలుసుకుంటున్నానని’ వాట్సన్ పేర్కొన్నాడు.