‘తేజ’స్సుకు చేయూత కావాలి!
సాక్షి, హైదరాబాద్: ఆ కుర్రాడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం... తండ్రి టీ కొట్టులో పని చేస్తాడు. వానొచ్చినా, వరదొచ్చినా వెళ్లి పని చేస్తేనే కుటుంబం గడుస్తుంది. కానీ ఆ కుర్రాడి మేధస్సు అపారం. చెస్ క్రీడ అంటే అపరిమితమైన అభిమానం. అందుకే ఆట కోసం తన ఆకలిని మరిచాడు. అవసరమైనప్పుడు కిలో మీటర్ల కొద్దీ నడిచాడు. పట్టుదలగా సాధన చేసి పోటీల్లో తనదైన ముద్ర చూపేందుకు ప్రయత్నిస్తున్నాడు. 17 ఏళ్ల ఆ కుర్రాడి పేరు పి. షణ్ముఖ తేజ. ఇటీవల అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన 1600లోపు ‘ఫిడే’ రేటింగ్ ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచి అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చెస్‌లో ముందుకు సాగుతున్న తేజ కెరీర్‌లో మరింత ఎదగాలని పట్టుదలగా ఉన్నాడు.
మొబైల్‌తోనే మెళకువలు: పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతో షణ్ముఖ చెస్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత పలు చిన్న స్థారుు పోటీలలో పాల్గొంటూ తన ప్రతిభను ప్రదర్శించాడు. కానీ ఆర్థిక సమస్యలు అతనికి కోచింగ్ తీసుకునేందుకు అడ్డంకిగా నిలిచారుు. దాంతో ఆన్‌లైన్ ద్వారా చెస్‌లో మెళకువలు నేర్చుకోవాలని నిర్ణరుుంచుకున్నాడు. అరుుతే కంప్యూటర్ కొనే శక్తి లేదు. దాంతో అతను తన మొబైల్ ఫోన్‌నే నమ్ముకున్నాడు. అందులోనే చెస్ పాఠాలు నేర్చుకుంటూ తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. గురువు లేకపోరుునా... తన మేధస్సుకు పదును పెట్టి నిలదొక్కుకునేందుకు అతను తీవ్రంగా శ్రమించాడు.
గేమ్‌లు ఆడటం ద్వారా...: తల్లిదండ్రులు అండగా నిలవడంతో తేజ చెస్‌కే అంకితమైపోయాడు. ఎక్కడ చెస్ టోర్నీ జరిగినా ఆడటం... విజయాలు వచ్చినా, పరాజయం దక్కినా సాధన కొనసాగించాడు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న కొందరు తమ పిల్లలకు చెస్‌లో శిక్షణ ఇప్పిస్తుంటారు. వారి ఆట మెరుగయ్యేందుకు సాధ్యమైనన్ని ఎక్కువ గేమ్‌లు ఆడాల్సి ఉంటుంది. అలాంటి వారికి ప్రత్యర్థిగా ఆడిన వ్యక్తికి కొంత మొత్తం ఇస్తారు. షణ్ముఖ నగరంలో ఇలాంటి అవకాశం ఎక్కడ ఉన్నా వెళ్లిపోయేవాడు.
వచ్చిన డబ్బులతో మళ్లీ ఎంట్రీ ఫీజు కట్టి టోర్నీలు ఆడుతూ తన ఆటను కొనసాగించాడు. ఎక్కడైనా గెలిచి ప్రైజ్‌మనీ వస్తే మంచిది లేదంటే మళ్లీ కష్టాలు మొదలు. కొన్ని సార్లు టోర్నీకి వెళ్లేందుకు డబ్బులు లేకపోతే ఎంత దూరమైనా నడిచి వెళ్లేవాడు. అలా జిల్లా, రాష్ట్ర స్థారుుల్లో అనేక విజయాలు నమోదు చేశాడు. గత ఏడాది రాష్ట్ర జట్టుకు ఎంపికై నా డబ్బులు లేకపోవడంతో టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది .
సహకారం లభిస్తే...: చెస్ కోసం ఇప్పుడు మేధస్సు ఉంటే మాత్రమే సరిపోదు. మంచి ఆర్థిక నేపథ్యం కూడా ఉండాల్సిన పరిస్థితి. కోచ్‌లు శిక్షణ ఇచ్చేందుకు గంటల లెక్కన డబ్బులు తీసుకుంటారు. కాస్త మెరుగైన కోచ్ దగ్గర శిక్షణ నెలకు దాదాపు రూ. 15-20 వేల మధ్యలో ఉంటుంది. దీనిని భరించగల స్థోమత షణ్ముఖకు లేదు. ప్రస్తుతం 1536 రేటింగ్ ఉన్న అతను ఇప్పటి వరకు మొబైల్‌లో శిక్షణ, సొంత ఆలోచనలతోనే నడిపించాడు. కానీ కెరీర్‌లో ఇంకా ఎదగాలంటే ఇది సరిపోదు. కాబట్టి ఎవరైనా అండగా నిలవాలని అతను కోరుతున్నాడు.
‘మంచి కోచింగ్, ల్యాప్‌టాప్ సౌకర్యంలాంటిది ఉంటే నా ఆట ఈ దశలో ఎంతో మెరుగవుతుంది. ఇప్పటి వరకు ఇబ్బందిగానే గడిచినా, ఇక ముందు మంచి ఫలితాలు సాధించాలంటే ఉన్నత స్థారుు శిక్షణ అవసరం. ప్రైజ్‌మనీ కొంత వరకు ఉపయోగపడుతున్నా, అది ఏమాత్రం చాలదు. ఎవరైనా నాకు ఆర్థిక సహకారం అందిస్తే ఇంకా గొప్ప విజయాలు సాధించగలనన్న నమ్మకం ఉంది‘ అని షణ్ముఖతేజ చెప్పాడు. క్రీడాభిమానులు, కార్పొరేట్లు ముందుకు వస్తే ఈ యువ మేధావి మరింత దూసుకుపోగలరనడంలో సందేహం లేదు.
ప్రోత్సహించిన తల్లిదండ్రులు..
షణ్ముఖ తండ్రి జయనారాయణ నల్లకుంట తిలక్‌నగర్ వద్ద హోటల్‌లో టీ తయారు చేస్తుంటారు. తల్లి సుబ్బలక్ష్మికి పోలియో. స్టాండ్ ఆధారం లేకుండా ఆమె నడవలేరు. జయనారాయణ ఆదాయం కుటుంబ పోషణకే సరిపోదు. ఇక కుర్రాడికి కావాల్సిన సౌకర్యాలు ఇప్పించడం అసాధ్యం. కానీ ఆయన తన కొడుకును నిరుత్సాహపర్చలేదు. ఉన్నంతలోనే పొదుపు చేసుకుంటూ తేజను టోర్నమెంట్లకు పంపిస్తున్నారు. అప్పోసొప్పో చేసి ఎంట్రీ ఫీజులు కట్టి ప్రోత్సహిస్తున్నారు.