
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహకంగా భావిస్తున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ సత్తా చాటగా... మరో ఇద్దరు విఫలమయ్యారు. తొలి రోజు భారత్ నాలుగు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. న్యూజిలాండ్ ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 340 పరుగులు చేసింది. హనుమ విహారి (150 బంతుల్లో 86; 8 ఫోర్లు), వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (111 బంతుల్లో 79 బ్యాటింగ్; 10 ఫోర్లు), ఓపెనర్ పృథ్వీ షా (88 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు టెస్టు జట్టులో స్థానం లేని మయాంక్ అగర్వాల్ (108 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే (12), ఓపెనర్ మురళీ విజయ్ (64 బంతుల్లో 28; 4 ఫోర్లు) మాత్రం ఈ అవకాశాన్ని సమర్థంగా వాడుకోలేకపోయారు.
తొలి వికెట్‌కు విజయ్‌తో 61 పరుగులు జోడించిన షా, రెండో వికెట్‌కు మయాంక్‌తో 50 పరుగులు జత చేశాడు. అనంతరం ఆంధ్ర ఆటగాడు విహారి చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. విహారి, మయాంక్ మధ్య మూడో వికెట్‌కు 73 పరుగులు జతకూడాయి. మయాంక్, రహానే 18 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. టెస్టు జట్టులో పునరాగమనాన్ని ఆశిస్తున్న న్యూజిలాండ్ పేసర్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో రహానే బౌల్డయ్యాడు. అయితే ఆ తర్వాత విహారి, పార్థివ్ మధ్య మరో భారీ భాగస్వామ్యం నెలకొంది. ధాటిగా ఆడిన వీరిద్దరు ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. అయితే సెంచరీ దిశగా దూసుకుపోతున్న విహారి చివరి ఓవర్ నాలుగో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో తొలి రోజు ఆట ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment