షెహ్‌జాద్ సెంచరీ
పాకిస్థాన్ అర్ధ సెంచరీ
బంగ్లాదేశ్‌పై అలవోక విజయం
ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్ వైఫల్యం
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
ఇప్పటి వరకూ టి20ల్లో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌లు (81) ఆడిన జట్టు పాకిస్థాన్. కానీ ఇన్నాళ్లూ ఆ జట్టుకు ఉన్న లోటు... ఒక్క పాక్ క్రికెటర్ కూడా సెంచరీ కొట్టలేదు. ఎట్టకేలకు అహ్మద్ షెహ్‌జాద్ ఆ లోటు ఆదివారం తీర్చాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన సూపర్-10 గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై షెహ్‌జాద్ (62 బంతుల్లో 111 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. దీంతో పాకిస్థాన్ 50 పరుగులతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ గెలుపుతో అంతర్జాతీయ టి20ల్లో 50 విజయాలు సాధించిన తొలి జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన 11వ క్రికెటర్‌గా షెహజాద్ నిలిచాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. షోయబ్ మాలిక్ (23 బంతుల్లో 26; 2 ఫోర్లు), ఆఫ్రిది (9 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రజాక్ రెండు వికెట్లు తీశాడు. అమిన్, షకీబ్, మహ్మదుల్లా ఒక్కో వికెట్ పడగొట్టారు.
బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. షకీబ్ (32 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. దాంతో టోర్నీలో బంగ్లాదేశ్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడింది. పాక్ బౌలర్లలో గుల్ మూడు, అజ్మల్ రెండు వికెట్లు తీసుకోగా... బాబర్, ఆఫ్రిదిలకు ఒక్కో వికెట్ దక్కింది. షెహ్‌జాద్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
టి20 ప్రపంచకప్‌లో నేడు
ఇంగ్లండ్ x నెదర్లాండ్స్
మధ్యాహ్నం గం. 3.00 నుంచి
న్యూజిలాండ్ x శ్రీలంక
రాత్రి గం. 7.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం