
శిఖర్ ధావన్, స్మృతి మంధాన(ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: క్రీడల్లో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డుకు టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానల పేర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రతిపాదించింది. ఈ విషయాన్ని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి బుధవారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఈ ఆటగాళ్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకే వారిని అర్జున అవార్డుతో సత్కరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శిఖర్ ధావన్ ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సన్‌రైజర్స్ తొలి రెండు మ్యాచ్‌లు గెలవడంలో ధావన్ పెద్దన్నపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయి, ఇంగ్లండ్‌పై టీమిండియా వన్డే సిరీస్ గెలవడంలో మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పాత్ర మరువలేనిది.