రోహిత్ శర్మ-శిఖర్ ధావన్(ఫైల్‌పొటో)
న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్-సెహ్వాగ్ తరహాలో ఒక విజయవంతమైన ఓపెనింగ్ జోడి రోహిత్-శిఖర్‌లే అనేది వాస్తవం. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్-ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో ధావన్ ప్రస్తావన వచ్చింది. చాలా కాలం పాటు వార్నర్‌తో కలిసి ధావన్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధావన్ గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నాడు వార్నర్. ధావన్‌తో ఓపెనింగ్ అనుభవం చెప్పాలని వార్నర్ అడిగిన సందర్భంలో రోహిత్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. (‘ఆ బ్యాట్‌తో ధోని ఆడొద్దన్నాడు’)
‘ధావన్ ఒక ఇడియట్(నవ్వుతూ). తొలి బంతిని ఫేస్ చేయడానికి ఇష్టపడేవాడు కాదు. స్టైక్ తీసుకోవడానికి ధావన్‌కు ఇష్టం ఉండేది కాదు. 2013లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నేను ఓపెనర్‌గా అరంగేట్రం చేశా. అప్పుడు ధావన్‌తో ఒక అనుభవం ఎదురైంది. అది చాంపియన్స్ ట్రోఫీ. ఓపెనర్‌గా నా తొలి మ్యాచ్. ఆ సమయంలో ధావన్‌ను స్ట్రైక్ తీసుకోమన్నా. నేను కొత్త బంతితో బౌలర్లను ఎదుర్కోలేని కారణంగా ధావన్‌ను స్ట్రైక్ తీసుకోమని అడిగా. దానికి ధావన్ ఒప్పుకోలేదు. లేదు రోహిత్.. నువ్వు చాలా కాలం నుంచి ఆడుతున్నావ్. ఇది నా తొలి పర్యటన. అందుచేత నువ్వే ఇన్నింగ్స్‌ను ఆరంభించాలన్నాడు. ఇక చేసేది లేక నేనే స్టైక్ తీసుకున్నా. ఓపెనర్‌గా తొలి ఓవర్ మోర్నీ మోర్కెల్‌తో ప్రారంభమైంది. తొలి మూడు బంతులు నాకు కనబడలేదు. బౌన్సర్లు వేశాడు.. కానీ ఆ బౌన్సర్లను ఊహించలేదు. అది ధావన్‌తో తొలి అనుభవం. ఇప్పుడు ధావన్‌తో బాగానే ఉంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇక ధావన్‌తో కలిసి పరుగులు తీసేటప్పుడు కొన్ని సందర్భాల్లో బాగా చికాకు వస్తుందని రోహిత్ తెలిపాడు. ‘స్టైకింగ్ ఎండ్‌లో ఉన్నప్పుడు కానీ నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్నప్పుడు కానీ పరుగు తీయడానికి సిద్ధం అవుతున్నాడో లేదో తెలియకుండా విసుగు తెప్పిస్తాడు. అతనితో కలిసి సింగిల్స్,డబుల్స్ రొటేట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. దాంతో చాలా పరుగులు తీసే అవకాశాన్ని కోల్పోయా. ఇక చివరగా ఒకటే డిసైడ్ అయ్యా. ధావన్ ఉన్నప్పుడు బంతి గ్యాప్‌లోకి వెళితేనే పరుగులు చేయాలని ఫిక్స్ అయ్యా’ అని రోహిత్ తెలిపాడు. ఈ విషయాన్ని వార్నర్ అంగీకరించాడు. ఇది ఎవరు చెబుతారని నిరీక్షిస్తున్నట్లు వార్నర్ వెల్లడించాడు. ఇలా ఒకరు గురించి పూర్తిగా జడ్జ్ చేయడం చాలా కష్టమని వార్నర్ పేర్కొన్నాడు. (పాక్ కెప్టెన్ జెర్సీ... పుణే మ్యూజియానికి )
Comments
Please login to add a commentAdd a comment