టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గొప్ప నాయకుడని మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. సహచర ఆటగాళ్ల పట్ల సారథి వ్యవహరించే తీరే అన్నికంటే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.
ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా.. కివీస్‌కు 0-2తో సిరీస్ సమర్పించుకుంది. దీంతో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌ల విజయాల(18) పరంపరకు బ్రేక్ పడింది. పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఓడిన భారత జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ స్పందించాడు. ‘‘క్రికెటర్లుగా మేము కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాం. గెలుపే మా లక్ష్యం. ఇక రోహిత్ గురించి చెప్పాలంటే.. అతడొక గొప్ప నాయకుడు. మ్యాచ్‌లు గెలిచామా? ఓడిపోయామా? అన్న ఫలితంతో సంబంధం లేకుండా.. ఒక జట్టును తీర్చిదిద్దడంలో కెప్టెన్‌గా తన వంతు పాత్ర చక్కగా పోషిస్తాడు.
సహచర ఆటగాళ్లతో అతడి బంధం ఎలా ఉందనేదే ముఖ్యం. అవసరమైన వేళ వాళ్లకు అండగా ఉన్నాడా? లేడా అన్నది కూడా ప్రధానం’’ అని శిఖర్ ధావన్ రోహిత్ శర్మను కొనియాడాడు. ఇక కివీస్‌తో సిరీస్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ ఆసీస్‌తో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం గురించి మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో టీమిండియా గొప్పగా రాణిస్తుంది. రోహిత్ తొలి మ్యాచ్ ఆడతాడా? లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు జట్టుతో లేనట్లయితే కచ్చితంగా ఆటగాళ్లు అతడి కెప్టెన్సీని మిస్సవుతారు.
అయితే, రోహిత్ లేకపోయినా జట్టులోని ప్రతి ఆటగాడు తమ బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు సాగుతారు. ప్రస్తుత టీమ్ ఆసీస్‌లోనూ బాగా ఆడుతుందనే నమ్మకం ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య నామమాత్రపు మూడో టెస్టు ముంబై వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు నవంబరులో ఆస్ట్రేలియా వెళ్తుంది.
Comments
Please login to add a commentAdd a comment