శిఖర్ ధావన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, స్పోర్ట్స్: ‘స్వదేశంలో పులి.. విదేశాల్లో పిల్లి..’ ఇలాంటి అపవాదును మూటగట్టుకున్న భారత స్టార్ ఆటగాళ్లలో శిఖర్ ధావన్ కూడా ఒకరు. కానీ ఇది ఒకప్పటి మాట. మొన్నటి దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ధావన్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనే తనకు బాగా కలిసొచ్చిందని చెబుతున్నాడు. ఇటీవల బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో తనను ఏ ప్లస్ జాబితాలో చేర్చడంపై ధావన్ తొలిసారి స్పందించాడు.
‘‘విదేశీ పిచ్‌లపై పరుగులు చేయడంలో నేను కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం. అయితే అదంతా గతం. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 లో చక్కటి ప్రదర్శన ఇచ్చాను. ఎలాగైనా సరే రాణించాలన్న పట్టుదలే నన్నునడిపించింది. బహుశా ఆ సిరీస్ వల్లే నాకు ఏ ప్లస్ కాంట్రాక్టు దక్కిఉంటుంది. ఏదేమైనా అలా జరగడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. త్వరలో జరుగనున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ రాణిస్తానన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు పటిష్టంగా ఉంది. సీనియర్లు, జూనియర్లతో టీమ్ సమతుల్యంగా ఉంది’’ అని చెప్పాడు ఈ డాషింగ్ ఓపెనర్. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో ధావన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహించనున్న సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment