తొలి టెస్టులో ధోని ఆడతాడు!
పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాం
ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యాఖ్య
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగబోయే తొలి టెస్టుకు కెప్టెన్ ఎంఎస్ ధోని అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. విరాట్ కోహ్లి తొలిసారిగా టెస్టు జట్టుకు సారథిగా ఉండేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని ధావన్ అన్నాడు. ‘ఇద్దరు కెప్టెన్లు చాలా దూకుడుగా ఉంటారు. అయితే ఇద్దరికీ స్పష్టమైన తేడా ఉంది. కోహ్లి మైదానంలో కాస్త ఆవేశంగా ఉంటాడు. ఇద్దరి నేతృత్వంలో ఆడడం చాలా బాగుంటుంది. ధోని రానుండడంతో కోహ్లి టెస్టు కెప్టెన్సీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే’ అని అన్నాడు.
‘జాన్సన్‌ను మెరుగ్గా ఆడతాం’
మరోవైపు సిరీస్‌లో పేసర్ మిచెల్ జాన్సన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో జాన్సన్ ఒకడని, అయితే తనలాంటి పేస్‌ను ఎదుర్కొనే విషయంలో తాము చాలా ప్రాక్టీస్ చేశామని గుర్తుచేశాడు. అలాగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో, ఐపీఎల్‌లో గతంలోనే తాను అతడి బౌలింగ్‌ను ఆడానని చెప్పాడు. ‘ఓవరాల్‌గా దూకుడుగా ఆడే ఓపెనర్ జట్టుకు అత్యం త ముఖ్యం. ఇది ఒక్క ఆస్ట్రేలియా గడ్డపైనే కాకుండా ప్రస్తుత క్రికెట్‌లో అవసరం. మిడిలార్డర్‌పై ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది. నేనలాంటి పాత్రను నిర్వర్తించడానికి ఇష్టపడతాను’ అని చెప్పాడు.
‘జట్టుకు ఉపయోగపడతా’
2013లో ధావన్ తన తొలి టెస్టును మొహాలీలో ఆసీస్‌పైనే ఆడి అత్యంత వేగవంతమైన సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. అప్పటి నుంచి జట్టులో చోటు పక్కా చేసుకున్నప్పటికీ విదేశీ పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ‘తొలి టెస్టు కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇది మాకు చాలా ముఖ్యమైన పర్యటన. ఆసీస్ అత్యుత్తమ జట్టు. వీరిపై భారీ స్కోరు సాధించడం ప్రత్యేకతనిస్తుంది. నా వైఫల్యాల నుంచి ఎప్పుడూ పాఠాలు నేర్చుకుంటాను. ఆసీస్ దేశం నాకు కొత్త కాదు. మెల్‌బోర్న్‌లో నా భార్య, పిల్లలతో గడిపేందుకు వస్తుంటాను. గతంలో చాలా క్రికెట్ ఇక్కడ ఆడాను. ఓపెనర్‌గా మంచి ఆరంభాన్నిచ్చి జట్టుకు ఉపయోగపడాలనుకుంటున్నాను’ అని ధావన్ పేర్కొన్నాడు.