గాయంతో విజయ్ దూరం
♦ జట్టులోకి శిఖర్ ధావన్
♦ శ్రీలంకతో టెస్టు సిరీస్
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో విజయ్ స్థానంలో శిఖర్ ధావన్‌కు చోటు లభించింది. ఈనెల 26 నుంచి శ్రీలంకలో ఈ మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. ‘సన్నాహక మ్యాచ్ ఆడే సమయంలో విజయ్ తన కుడిచేతి మణికట్టు నొప్పిగా ఉందని సమాచారం ఇచ్చాడు. దీంతో బీసీసీఐ మెడికల్ సిబ్బంది అతడిని పరీక్షించి పునరావాస శిబిరానికి వెళ్లాలని సూచించారు. దీంతో అతను లంక పర్యటనకు దూరం కానున్నాడు.
అతడి స్థానంలో సెలక్షన్ కమిటీ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేసింది’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. గతంలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా విజయ్ మణికట్టు గాయంతోనే దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా ఆడలేదు. ఇక ధావన్ తన చివరి టెస్టు గతేడాది న్యూజిలాండ్‌పై ఆడాడు. లోకేశ్ రాహుల్‌తో కలిసి ధావన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీ, కరీబియన్ పర్యటనలోనూ ధావన్ విశేషంగా రాణించిన సంగతి తెలిసిందే.