
ఇండోర్: ముంబై యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి రోజు రికార్డు శతకంతో మెరిశాడు. సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్లతో 147 పరుగులు సాధించాడు. టి20 క్రికెట్‌లో (అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిపి) భారత్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. గత ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున సన్‌రైజర్స్‌పై రిషభ్ పంత్ (128 నాటౌట్) చేసిన స్కోరును అయ్యర్ అధిగమించాడు.
ఈ క్రమంలో అయ్యర్ 38 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అతని దూకుడుకు సిక్కిం మీడియం పేసర్ తషీ భల్లా ఒకే ఓవర్లో 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రిషభ్ పంత్ (12) రికార్డునే సవరిస్తూ 15 సిక్సర్లు బాదిన అయ్యర్ ఓవరాల్‌గా టి20ల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. శ్రేయస్ జోరుతో ముంబై 154 పరుగుల భారీ తేడాతో సిక్కింను చిత్తుగా ఓడించింది. అయ్యర్‌కు తోడు సూర్య కుమార్ యాదవ్ (63) రాణించడంతో ముందుగా ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 258 పరుగులు చేసింది. రహానే (11), పృథ్వీ షా (10) విఫలమయ్యారు. అనంతరం సిక్కిం 20 ఓవర్లలో 7 వికెట్లకు 104 పరుగులు చేయగలిగింది.
61 బంతుల్లో పుజారా సెంచరీ
ఇండోర్: భారత టెస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తనపై అందరికీ ఉన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిపోయాడు. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి పుజారా (61 బంతుల్లో 100 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. అయితే చివరకు మ్యాచ్‌లో 5 వికెట్లతో రైల్వేస్‌కే విజయం దక్కింది. ముందుగా సౌరాష్ట్ర 3 వికెట్లకు 188 పరుగులు చేయగా... రైల్వేస్ 5 వికెట్లకు 190 పరుగులు సాధించింది.
►4టి20ల్లో భారత్ తరఫున అయ్యర్ (38 బంతుల్లో) నాలుగో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. పంత్ (32), రోహిత్ (35), యూసుఫ్ పఠాన్ (37) ఈ జాబితాలో ముందున్నారు.
Comments
Please login to add a commentAdd a comment