సంతోషికి రజతం
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మత్స్య సంతోషి సత్తా చాటింది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె రజత పతకాన్ని సాధించింది. మంగళవారం జరిగిన సీనియర్ మహిళల 53 కేజీల విభాగం ఫైనల్లో సంతోషి ఓవరాల్‌గా 194కేజీల బరువునెత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో 86కేజీల లిఫ్ట్ చేసిన సంతోషి క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్‌లో 108 కేజీల బరువునెత్తింది. ఈ విభాగంలో భారత్‌కే చెందిన సంజిత చాను ఓవరాల్‌గా 195 కేజీల బరువునెత్తి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
మరోవైపు సీనియర్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను విజేతగా నిలవడంతో పాటు స్నాచ్ విభాగంలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఆమె ఫైనల్లో ఓవరాల్‌గా 189 కేజీల బరువునెత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తాజాగా స్నాచ్ విభాగంలో 85 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న రికార్డు (84 కేజీలు)ను తిరగ రాసింది. ఈ విజయాలతో మీరాబాయి, సంజిత వచ్చే ఏడాది ఇదే వేదికపై జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు.