బ్రెజిల్ 'ఎగిరింది'
పోల్‌వాల్ట్‌లో థియాగో సిల్వాకు స్వర్ణం
ఒలింపిక్ రికార్డుతో అగ్రస్థానం
ఆతిథ్య దేశానికి రెండో పసిడి
ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 77 వేల కోట్లు పోసి ఒలింపిక్స్ నిర్వహిస్తున్నాం. కనీసం ఏడు స్వర్ణాలు అయినా కళ్లచూడాలి అనుకున్నాం... కోటి కష్టాలు, వేవేల విమర్శలు అన్నింటినీ తట్టుకొని ఆటల పండగకు ఆతిథ్యం ఇస్తున్నాం... గుప్పెడు పతకాలు మా గడపలో వాలాలని కోరుకోవడంలో తప్పేముంది... ఇదీ బ్రెజిల్ ప్రజల మనసులో మాట. అయితే వారు ఆశించిన ఆనందం మాత్రం అంతే స్థాయిలో దక్కడం లేదు. పది రోజుల వరకు ఒక్క పసిడి పతకంతోనే సరి పెట్టుకున్న ఆ దేశంలో ఇప్పుడు అభిమానుల మోముపై మళ్లీ చిరునవ్వు పూసింది. పోల్‌వాల్ట్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బ్రెజిల్ అథ్లెట్ థియాగో సిల్వా అనూహ్యంగా స్వర్ణాన్ని అందుకొని మళ్లీ తమ దేశవాసుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు.
రియో: ఒలింపిక్స్‌లో వారం రోజుల తర్వాత బ్రెజిల్ మళ్లీ సంతోషంలో మునిగింది. ఈ సారి అథ్లెటిక్స్‌లో ఆ జట్టుకు పసిడి పతకం లభించింది. 22 ఏళ్ల థియాగో బ్రాజ్ ద సిల్వా పోల్‌వాల్ట్‌లో విజేతగా నిలిచి స్వర్ణ కాంతులు పంచాడు. 6.03 మీటర్ల ఎత్తు ఎగిరి అగ్రస్థానం అందుకున్న సిల్వా... గత పోటీల స్వర్ణ విజేత, వరల్డ్ రికార్డ్ సాధించిన రెనాడ్ లావిలెనీ (ఫ్రాన్స్)కు షాక్ ఇచ్చాడు. 5.98 మీటర్ల ఎత్తును దాటిన రెనాడ్‌కు రజత పతకం లభించగా, శామ్ కెండ్రిక్స్ (అమెరికా-5.85 మీ.) కాంస్యం అందుకున్నాడు. థియాగో కొత్త ఒలింపిక్ రికార్డు నెలకొల్పడం విశేషం.
తొలి సారి ఆరు మీటర్లు దాటి
నాలుగేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సిల్వాపై ఎవరూ పెద్దగా పతక ఆశలు పెట్టుకోలేదు. ఈ ఏడాది ఆరంభంలో జర్మనీలో జరిగిన ఇండోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో అతను గరిష్టంగా 5.93 మీటర్లు ఎగిరాడు. రియోలో అతను తన అత్యుత్తమ ప్రదర్శనకంటే మరో 10 సెంటీ మీటర్లు మెరుగైన ప్రదర్శన చూపించగలిగాడు. 1952 తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు గెలిచిన ఆటగాడిగా నిలవాలని బరిలోకి దిగిన ప్రధాన పోటీదారు లావిలెనీ 5.98 మీటర్ల ఎత్తును సునాయాసంగా అధిగమించాడు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ థియాగో 6.03 మీటర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ క్షణంలో బ్రెజిల్ దేశం మొత్తం ఉత్కంఠకు లోనైంది. తన తొలి ప్రయత్నంలో సిల్వా దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో అందరిలో నిరాశ కనిపించింది. అయితే తన శక్తినంతా కూడదీసుకొని రెండో ప్రయత్నంలో అతను 6.03 మీటర్లను కొట్టేశాడు. తన జీవితంలో అతి పెద్ద లక్ష్యాన్ని అధిగమించాడు.
ప్రేక్షకుల గోల మధ్య...
సిల్వా ప్రదర్శనతో లావిలెనీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. రెండు ప్రయత్నాల్లోనూ అతను దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. మూడో ప్రయత్నం కోసం రన్‌వే వద్ద నిలబడగానే స్టేడియంలో గోల మొదలైంది. దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అతను ‘థమ్స్ డౌన్’ అంటూ సైగ చేశాడు. దాంతో బ్రెజిల్ అభిమానులు మరింత రెచ్చిపోయారు. చివరకు పెద్ద జంపింగ్‌కు ప్రయత్నించి డిఫెండింగ్ చాంపియన్ మోకాలు బార్‌కు తగలడంతో నిరాశగా వెనుదిరిగాడు. మరుక్షణంలో సిల్వా పేరుతో ఆ ప్రాంగణమంతా హోరెత్తింది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రేక్షకుల ప్రవర్తన ఇలా ఉండటం అసహనం కలిగించిందని... 1936లో జెస్సీ ఓవెన్స్‌ను కూడా ఇలాగే ప్రేక్షకులు ఆట పట్టించారని పోలిక తెస్తూ లావిలెనీ విమర్శలు చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. దాంతో అతను తాను తప్పుడు పోలిక తీసుకొచ్చానని, ఏదో ఆవేశంలో అన్న మాట అంటూ చివరకు అందరికీ క్షమాపణ చెప్పుకున్నాడు.
►రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్‌కు ఇది రెండో స్వర్ణం. జూడోలో రఫెలా సిల్వా తమ దేశానికి మొదటి స్వర్ణాన్ని అందించింది.
►1984 ఒలింపిక్స్ తర్వాత బ్రెజిల్‌కు అథ్లెటిక్స్‌లో పసిడి లభించడం ఇదే తొలిసారి.
► లండన్ ఒలింపిక్స్‌లో బ్రెజిల్ మొత్తం 3 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఖాతాలో ఇంకా 2 స్వర్ణాలే ఉన్నాయి. ►2012లో మరో 5 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 17 పతకాలు సాధించింది. రియోలో 4 రజతాలు, 4 కాంస్యాలు సహా ఇప్పటి వరకు గెలిచిన మొత్తం పతకాలు 10. మరి సొంత గడ్డపై గత రికార్డును ఆ దేశం మెరుగు పరుచుకుంటుందో లేదో చూడాలి.