
తొలి సెమీస్ కు వర్షం అడ్డంకి: ఫైనల్ కు చేరిన శ్రీలంక
మిర్పూర్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో మరోసారి శ్రీలంక ఫైనల్ కు చేరింది. పొట్టి ఫార్మెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ వెస్టిండీస్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్ డే అండ్ నైట్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారడంతో ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం ప్రకటించారు. వెస్టిండీస్ 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి 80 చేసిన దశలో వడగండ్ల వాన మ్యాచ్ ను అడ్డుకుంది. దీంతో కాసేపు మ్యాచ్ తాత్కాలికంగా వాయిదా పడింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో చివరకు డక్ వర్త్ లూయిస్ పద్దతిని అనుసరించి విజేతను ఖరారు చేశారు. ఈ పద్దతి ప్రకారం శ్రీలంక 27 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది.
టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 161 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ కు నిర్దేశించింది. లంకేయుల పటిష్ట బౌలింగ్ ను ఎదుర్కొడానికి బరిలో దిగిన వెస్టిండీస్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు క్రిస్ గేల్(3), స్మిత్ (17) పరుగులు మాత్రమే చేసి విండీస్ కు షాకిచ్చారు. అనంతరం సిమ్మన్స్ (4) పరుగులు చేసి వెస్టిండీస్ ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఈ తరుణంలో స్కోరును ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను శామ్యూల్స్, బ్రేవోలపై పడింది. వారి ఆచితూచి ఆడుతూ నే అవసరమైనప్పుడు బ్యాట్ ను ఝుళిపించారు. కాగా, బ్రేవో (30) ల వద్ద పెవిలియన్ చేరాడు. శామ్యూల్స్(16), సమీ(0) తో క్రీజ్ లో ఉండగా వడగండ్ల వాన కురవడంతో మ్యాచ్ రద్దయ్యింది.
అంతకుముందు టాస్ గెలిచిన లంకేయులు బ్యాటింగ్ చేపట్టారు. ఓపెనర్లు పెరీరా(26), దిల్షాన్(39) పరుగులు చేసి శ్రీలంకకు శుభారంభానిచ్చారు. అనంతరం సంగక్కారా(1), జయవర్థనే(0) కే పెవిలియన్ చేరడంతో లంకేయులు స్కోరు కాస్త మందగించింది. కాగా మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు తిరుమన్నే(44), మాథ్యూస్(40) పరుగులు చేయడంతో లంకేయులు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.