స్లిప్ ఫీల్డింగ్ మెరుగవ్వాలి
సునీల్ గావస్కర్
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు ఆడిన తీరు అమోఘం. బంతి గమనాన్ని చక్కగా అర్థం చేసుకున్న కుశాల్ మెండిస్, కరుణరత్నే జోడి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఇద్దరూ శతకాలతో చెలరేగినా మిగతా వారి నుంచి మాత్రం అలాంటి ఆటతీరు కనిపించలేదు. ఇక మూడో టెస్టు జరిగే కాండీ మైదానంలో మెండిస్‌కు మెరుగైన రికార్డు ఉంది. గతేడాది ఆసీస్‌పై అతను 176 పరుగులు సాధించి లంక విజయానికి కారకుడయ్యాడు.
మరోసారి ఆతిథ్య జట్టు అతడి నుంచి కీలక ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. అయితే లంక బౌలర్లకు భారత బ్యాటింగ్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసే సామర్థ్యం లేదు. ఒకవేళ అవుట్ చేసినా స్వల్ప స్కోరును కాపాడే సత్తా భారత బౌలర్లకు ఉంది. ఇక భారత బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. ఆటగాళ్లందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. పుజారా ఆటతీరు అలా సాగిపోతూనే ఉంది. మున్ముందు క్లిష్టమైన సిరీస్‌లు ఆడాల్సి ఉండటంతో తాము కూడా అతడిలాగే క్రీజులో వీలైనంత ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుందని ఇతర ఆటగాళ్లు గ్రహించా లి.
ఈ మ్యాచ్ కు జడేజా దూరం కానుండడంతో కుల్దీప్‌కు చోటిస్తే జట్టుకు ఉపయోగపడగలడు. అతడికి ఎన్ని అవకాశాలిస్తే అంత మెరుగవుతాడు. స్లిప్ క్యాచింగ్ విషయంలో భారత ఆటగాళ్లు చాలా మెరుగవ్వాలి. తక్కువ ఎత్తులో వచ్చిన బంతులను పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ విషయంలో తమ లోపాలను అధిగమిస్తే రెండు రోజుల ముందే మ్యాచ్‌ను ముగించి విశ్రాంతి తీసుకోవచ్చు.