సెంచరీ 'మంధ' హాసం | Smriti Mandhana Guides India To 7-Wicket Win Over West Indies | Sakshi
Sakshi News home page

సెంచరీ 'మంధ' హాసం

Published Fri, Jun 30 2017 1:20 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

సెంచరీ 'మంధ' హాసం

సెంచరీ 'మంధ' హాసం

విండీస్‌పై 7 వికెట్లతో భారత్‌ జయభేరి
రాణించిన పూనమ్, హర్మన్‌ప్రీత్‌


భారత అమ్మాయిల ఆల్‌రౌండ్‌ జోరు కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను దెబ్బతీయగా... తర్వాత లక్ష్యఛేదనలో ఓపెనర్‌ స్మృతి మంధన శతక్కొట్టింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ రాణించడంతో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

టాంటన్‌: భారత ఓపెనర్‌ స్మృతి మంధన బ్యాటింగ్‌లో మళ్లీ గర్జించింది. గత మ్యాచ్‌లో సెంచరీకి 10 పరుగుల దూరంలో నిలిచిన ఆమె ఈసారి ఛేదనలో శతక్కొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గత ప్రపంచకప్‌ రన్నరప్, టి20 చాంపియన్‌ వెస్టిండీస్‌ను కంగుతినిపించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ను ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దెబ్బతీసింది. దీంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది.

హేలీ మాథ్యూస్‌ (57 బంతుల్లో 43; 7 ఫోర్లు) రాణించగా, భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్, హర్మన్‌ప్రీత్‌ కౌర్, దీప్తి శర్మ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్‌ 42.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ స్మృతి మంధన (108 బంతుల్లో 106 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టగా, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (88 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించింది. స్మృతికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

దెబ్బ మీద దెబ్బ
టాస్‌ నెగ్గిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. విండీస్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హేలీ మాథ్యూస్, ఫెలిసియా వాల్టర్స్‌ శుభారంభం అందించలేకపోయారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఫెలిసియా (9) నిష్క్రమించింది. ఏక్తా బిష్త్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో సుష్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. తర్వాత హెలీకి కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ జతయ్యింది. ఇద్దరు నింపాదిగా ఆడుతున్న దశలో హేలీ, దీప్తిశర్మకు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ఇక్కడి నుంచి వెస్టిండీస్‌ కష్టాలు మొదలయ్యాయి. భారత స్పిన్నర్లు పూనమ్‌ యాదవ్, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పిచ్‌ నుంచి సహకారం లభించడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశారు.

దీంతో ఆ తర్వాత 15 ఓవర్లలో కేవలం 21 పరుగులే జతచేసిన వెస్టిండీస్‌ 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న టేలర్‌ (16) రనౌట్‌ కాగా... డియాండ్రా డాటిన్‌ (7), మెరిస్సా అగులిరా (6) పూనమ్‌ బౌలింగ్‌లో నిష్క్రమించారు. కైషోనా (5), చెడియాన్‌ నషన్‌ (12)లు హర్మన్‌ప్రీత్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరారు. 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను టెయిలెండర్లు షానిల్‌ డాలీ (37 బంతుల్లో 33; 5 ఫోర్లు), అఫి ఫ్లెచర్‌ (23 బంతుల్లో 36 నాటౌట్‌; 4 ఫోర్లు) ఆదుకున్నారు. దీంతో ప్రత్యర్థి ముందు విండీస్‌ 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

చెలరేగిన స్మృతి...
సునాయాస లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత మహిళలకు ఆదిలోనే పూనమ్‌ రౌత్‌ (0) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌ ఐదో బంతికే ఆమె కానెల్‌ బౌలింగ్‌ డకౌటైంది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ దీప్తి శర్మ (6) స్టెఫానీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయింది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఓపెనర్‌ స్మృతి మంధన, కెప్టెన్‌ మిథాలీ నడిపించారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ తొలుత క్రీజ్‌లో పాతుకుపోయారు. ఆ తర్వాత తమదైన శైలిలో స్వేచ్ఛగా ఆడారు.

వెస్టిండీస్‌ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. స్మృతి 57 బంతుల్లో అర్ధసెంచరీ చేసింది. మిథాలీతో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. జట్టు స్కోరు 141 పరుగుల వద్ద మిథాలీ... హేలీ మాథ్యూస్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరింది. దీంతో మూడో వికెట్‌కు 108 పరుగులు భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత స్మృతి,  మోనా మేష్రమ్‌(18 నాటౌట్‌) సహకారంతో 105 బంతుల్లో సెంచరీని పూర్తిచేయడంతో పాటు జట్టును గెలిపించింది.

స్కోరు వివరాలు
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: హేలీ మాథ్యూస్‌ (సి) అండ్‌ (బి) దీప్తి శర్మ 43; ఫెలిసియా (సి) సుష్మ (బి) ఏక్తాబిష్త్‌ 9; స్టెఫానీ టేలర్‌ రనౌట్‌ 16; డాటిన్‌ (సి) పూనమ్‌ రౌత్‌ (బి) పూనమ్‌ యాదవ్‌ 7; మెరిస్సా (స్టంప్డ్‌) సుష్మ (బి) పూనమ్‌ యాదవ్‌ 6; కైషోనా నైట్‌ (సి) స్మృతి (బి) హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 5; చెడియాన్‌ (స్టంప్డ్‌) సుష్మ (బి) హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 12; షానిల్‌ డాలీ (స్టంప్డ్‌) సుష్మ (బి) దీప్తి శర్మ 33; అఫి ఫ్లెచర్‌ నాటౌట్‌ 36; అనిసా మొహమ్మద్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 183.

వికెట్ల పతనం: 1–29, 2–69, 3–70, 4–80, 5–91, 6–91, 7–121, 8–146. బౌలింగ్‌: జులన్‌ గోస్వామి 6–0–37–0, శిఖాపాండే 3–0–13–0, ఏక్తాబిష్త్‌ 10–2–23–1, దీప్తిశర్మ 10–1–27–2, మోనా మేశ్రమ్‌ 4–0–20–0, పూనమ్‌ యాదవ్‌ 10–2–19–2, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 7–0–42–2.

భారత్‌ ఇన్నింగ్స్‌: పూనమ్‌ రౌత్‌ (సి) మెరిస్సా (బి) కానెల్‌ 0; స్మృతి మంధన నాటౌట్‌ 106; దీప్తిశర్మ (బి) స్టెఫానీ 6; మిథాలీ (సి) అఫి ఫ్లెచర్‌ (బి) హేలీ మాథ్యూస్‌ 46; మోనా మేశ్రమ్‌ నాటౌట్‌ 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (42.3 ఓవర్లలో 3 వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1–0, 2–33, 3–141
బౌలింగ్‌: కానెల్‌ 4–0–23–1, డాటిన్‌ 4–0–25–0, స్టెఫానీ 10–1–24–1, డాలీ 5–0–24–0, అనిసా 6–0–25–0, అఫి ఫ్లెచర్‌ 4–0–18–0, చెడియాన్‌ 1–0–9–0, హేలీ మాథ్యూస్‌ 8.3–0–35–1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement