windies
-
ఆసీస్ మహిళా క్రికెటర్ మెగాన్ షుట్ హ్యాట్రిక్
మహిళల క్రికెట్లో ఆ్రస్టేలియా పేసర్ మెగాన్ షుట్ అరుదైన ఘనతను నమోదు చేసింది. బుధవారం నార్త్‌సౌండ్‌లో వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో ఆమె ‘హ్యాట్రిక్’ సాధించింది. విండీస్ ఇన్నింగ్స్ 50వ ఓవర్ చివరి మూడు బంతులకు ఆమె మూడు వికెట్లు తీసింది. ఆసీస్‌కు వన్డేల్లో ఇదే తొలి హ్యాట్రిక్. గతేడాది భారత్‌తో ముంబైలో జరిగిన టి20 మ్యాచ్‌లో కూడా ‘హ్యాట్రిక్’ తీసిన ఘనత ఆమె సొంతం. తద్వారా అంతర్జాతీయ వన్డేలు, టి20ల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా మెగాన్ షుట్ రికార్డులకెక్కింది. -
హోప్ సెంచరీ వృథా: బంగ్లాదేశ్ చేతిలో విండీస్ ఓటమి
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌లో వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన వన్డేలో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్ షై హోప్ (109; 11 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో సెంచరీ చేశాడు. రోస్టన్ ఛేజ్ (51; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించాడు. బంగ్లా బౌలర్లలో మొర్తజా (3/49), సైఫుద్దీన్ (2/47) రాణించారు. అనంతరం తమీమ్ (80; 7 ఫోర్లు), సౌమ్య సర్కార్ (73; 9 ఫోర్లు, 1 సిక్స్), షకీబుల్ (61 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీల సాయంతో బంగ్లాదేశ్ 45 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి గెలిచింది. -
లూయిస్ మెరుపులు
ఢాకా: విండీస్ విధ్వంసక ఓపెనర్ ఎవిన్ లూయిస్ (36 బంతుల్లో 89; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరిదైన మూడో టి20లో వెస్టిండీస్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. బంగ్లా పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన విండీస్ పొట్టి ఫార్మాట్లో సత్తా చాటింది. లూయిస్ మెరుపులకు తోడు షై హోప్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), నికోలస్ పూరన్ (29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లూయిస్ తుపానులా విరుచుకుపడటంతో 7.2 ఓవర్లలోనే విండీస్ స్కోరు 100 దాటింది. మూడో వికెట్ రూపంలో అతను వెనుదిరిగే సమయానికి విండీస్ స్కోరు 9.2 ఓవర్లలో 122/3. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు మహ్ముదుల్లా (3/18), ముస్తఫిజుర్ (3/33), షకీబుల్ హసన్ (3/37) కట్టడి చేయడంతో విండీస్ చివరకు 190 పరుగులకు పరిమితమైంది. లక్ష్యఛేదనలో బంగ్లా 17 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (25 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 ఫోర్లు) ఒక్కడే పోరాడగా... తమీమ్ ఇక్బాల్ (8), సౌమ్య సర్కార్ (9), షకీబ్ (0), ముష్ఫికర్ రహీం (1) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 5 వికెట్లు పడగొట్టగా, అలెన్‌కు 2 వికెట్లు దక్కాయి. -
పుణేలో పల్టీ.. 43 పరుగులతో ఓడిన భారత్
మొదటి మ్యాచ్‌లో ఓడి... రెండో దానిని ‘టై’గా ముగించి... సిరీస్‌లో పుంజుకున్న వెస్టిండీస్ మూడో వన్డేలో ఏకంగా గెలుపునే సొంతం చేసుకుంది. బౌలింగ్ బలాన్ని కూడదీసుకుని మరీ బరిలో దిగిన భారత్... బ్యాటింగ్‌లో బలహీనతలను మాత్రం అధిగమించలేకపోయింది. టాపార్డర్‌పై అతిగా ఆధారపడి బోల్తా కొట్టింది. ఛేదనలో మొనగాడైన కెప్టెన్ విరాట్ కోహ్లి 38వ శతకం బాదినా... మిగతా అందరూ బ్యాట్లెత్తేయడంతో టీమిండియా ఓటమి మూటగట్టుకుంది. ప్రత్యర్థి లోయరార్డర్ పోరాడి జోడించిన పరుగులే మ్యాచ్‌లో తేడాను చూపాయి. పుణే: ఎట్టకేలకు వెస్టిండీస్కో విజయం. భారత పర్యటనలో గెలుపునకు మొహం వాచిన ఆ జట్టు మూడో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దానిని అందుకుంది. మరోవైపు బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో టీమిండియాకు పరాజయం ఎదురైంది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు 43 పరుగులతో కోహ్లి సేనను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. శతకం చేజారినా, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ షై హోప్ (113 బంతుల్లో 95; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. యువ హెట్‌మైర్ (21 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆష్లే నర్స్ (22 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ జాసన్ హోల్డర్ (39 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) తలో చేయి వేశారు. బుమ్రా (4/35) ప్రత్యర్థిని కట్టడి చేయడంతో పాటు కీలక వికెట్లు పడగొట్టాడు. 284 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ విరాట్ కోహ్లి (119 బంతుల్లో 107; 10 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగినా... ఓపెనర్ శిఖర్ ధావన్ (45 బంతుల్లో 35; 5 ఫోర్లు) మినహా ఇంకెవరూ రాణించకపోవడంతో భారత్ 47.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో శామ్యూల్స్ (3/12) మూడు వికెట్లు తీయగా, హోల్డర్, మెకాయ్, నర్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. నాలుగో వన్డే సోమవారం ముంబైలో జరుగుతుంది. ఇటు ‘హోప్’... అటు నర్స్ ఓపెనర్లు కీరన్ పావెల్ (21), హేమరాజ్ (15)లను బుమ్రా తక్కువ స్కోర్లకే ఔట్ చేయడం, శామ్యూల్స్ (9) వైఫల్యంతో విండీస్ ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ, హోప్, హెట్‌మైర్ జోడీ మరోసారి నిలిచింది. ముఖ్యంగా హెట్‌మైర్... స్పిన్నర్లు చహల్, కుల్దీప్లను లక్ష్యంగా చేసుకున్నాడు. అయితే, కుల్దీప్ బౌలింగ్‌లో ధోని మెరుపు స్టంపింగ్ అతడి దూకుడుకు తెరదించింది. బుమ్రా, భువీ రెండో స్పెల్‌లో పరుగులు రావడం కష్టంగా మారినా హోప్ మాత్రం పట్టువదలకుండా ఆడాడు. 72 బంతుల్లో అర్ధ శతకం పూర్తిచేసుకున్నాక ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఖలీల్ ఓవర్లలో రెండు సిక్స్‌లు కొట్టాడు. హోల్డర్ అండగా నిలిచాడు. అతడితో పాటు, ఫాబియాన్ అలెన్ (5) నిష్క్రమించడం, హోప్‌ను బుమ్రా యార్కర్‌తో బౌల్డ్ చేయడంతో విండీస్ 227/8కు పడిపోయింది. ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగదనుకుంటుండగా నర్స్ అడ్డుపడ్డాడు. గత మ్యాచ్‌లో చివరి ఓవర్లో విజయానికి అవసరమైన పరుగులు చేయడంలో విఫలమైన అతడు... ఈసారి పూర్తి భిన్నంగా కనిపించాడు. చహల్ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ బాదాడు. 49వ ఓవర్లో భువీకి మూడు బౌండరీలు, సిక్స్‌తో చుక్కలు చూపాడు. దీంతో భువీ ఏకంగా 21 పరుగులు ఇచ్చుకున్నాడు. 9వ వికెట్ రోచ్ (15 నాటౌట్)తో కలిసి 35 బంతుల్లోనే 50 పరుగులు జోడించాడు. కోహ్లి ఒక్కడే... తక్కువ ఎత్తులో వచ్చిన హోల్డర్ బంతిని ఆడలేకపోయిన రోహిత్ శర్మ (8) మరోసారి త్వరగానే ఔటవ్వడంతో ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. రెండో వికెట్‌కు కోహ్లితో 79 పరుగులు జోడించి కుదురుకున్నట్లే కనిపించిన ధావన్... నర్స్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కు యత్నించి ఎల్బీ అయ్యాడు. ఎప్పటిలానే పరుగులు రాబట్టిన కోహ్లి 63 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్‌కు అంబటి రాయుడు (22) సహకారమందించడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. అయితే, మెకాయ్ బంతిని వికెట్ల మీదకు ఆడుకుని రాయుడు పెవిలియన్ చేరాడు. వస్తూనే లైఫ్ దక్కిన రిషభ్ పంత్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని మెరుపు షాట్లు కొట్టినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సాధికారికంగా ఆడుతూ, 90ల్లో ఉన్న కోహ్లికి తోడ్పాటునివ్వడంతో పాటు జట్టును గెలుపు తీరానికి చేర్చాల్సిన దశలో వచ్చిన ధోని (7) వైఫల్యాల పరంపర కొనసాగించాడు. వికెట్‌కు దూరంగా హోల్డర్ వేసిన బంతిని బ్యాట్‌కు తగిలించుకుని కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే, హోల్డర్ మరుసటి ఓవర్లో సింగిల్‌తో కోహ్లి శతకం (110 బంతుల్లో) అందుకున్నాడు. బ్యాటింగ్ చేయగలిగిన భువనేశ్వర్ (10)తో కలిసి కెప్టెన్ గెలిపిస్తాడని అభిమానులు భావిం చారు. కానీ, కోహ్లిని శామ్యూల్స్ బౌల్డ్ చేయడంతో ఆశలు నీరుగారాయి. ►మూడు వరుస సెంచరీలు చేసిన తొలి కెప్టెన్ విరాట్ కోహ్లినే. -
విండీస్ సమీక్ష చేసుకోవాలి
విండీస్‌పై భారత్ అతి భారీ విజయం సిరీస్ సాగనున్న తీరుపై అభిమానులను ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేసి ఉంటుంది. అయితే, కరీబియన్ జట్టు పుంజుకోగలదు. గతేడాది ఇంగ్లండ్‌లో ఇదే పరిస్థితుల్లో వారు టెస్టు నెగ్గారు. ఆ మ్యాచ్‌లో షై హోప్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన బ్రాత్‌వైట్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఈ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఇద్దరు రాణిస్తే రాజ్‌కోట్‌లో కంటే విండీస్ ఎక్కువ పరుగులు చేయగలదు. తొలి టెస్టులో భారత స్పిన్నర్లను ఎదుర్కొనడంలో సరైన దృక్పథం లేకపోవడమే పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌కు ప్రతిబంధకంగా మారింది. బంతి విపరీతంగా తిరిగితే వారి ప్రదర్శనను అర్ధం చేసుకోవచ్చు. కానీ, పరిస్థితి అలా లేదు. వ్యూహాత్మకంగా ఆడాల్సింది పోయి క్రీజులో నిలవలేం అన్నట్లు తొందరపడ్డారు. 649 పరుగుల భారీ స్కోరు దన్నుతో... భారత స్పిన్నర్లకు ఒకటీ రెండు ఓవర్లలో విపరీతంగా పరుగులిచ్చినా బాధపడాల్సిన అవసరం లేకపోయింది. వారు వరుసపెట్టి వికెట్లు తీయడం భారత కెప్టెన్‌ను సంతోషపర్చి ఉంటుంది. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ టెస్టులో తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. బౌన్సర్లు సంధించడంపై అంతగా ఉత్సుకత చూపకపోవడం కూడా మ్యాచ్‌లో విండీస్ పోటీ ఇవ్వకపోవడానికి మరో కారణం. విపరీతమైన వేడిని కారణంగా చెప్పుకొన్నా, ఒక వేగవంతమైన బౌలర్ తన ప్రధాన ఆయుధాన్ని ఉపయోగించుకోకుంటే పటిష్ఠ భారత బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయడానికి ఇక మార్గం ఏముంటుంది? స్వింగ్, సీమ్ రెండూ లేని రాజ్‌కోట్ పిచ్‌పై బౌలర్లు బౌన్సర్లు వేసి ఉంటే విండీస్ తిరిగి పోటీలోకి రాగలిగేది. వారు కనుక ఈ పరాజయంపై నిజాయతీగా సమీక్ష చేసుకుంటే రెండో టెస్టులో పోటీని ఇచ్చే ప్రదర్శన చేయగలరు. లేదంటే మరో పరాజయం తప్పకపోవచ్చు. -
సునీల్ ఆంబ్రిస్ సెంచరీ
వడోదర: బ్యాట్స్‌మెన్ రాణించడంతో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ను విండీస్ ‘డ్రా’ చేసుకుంది. ఆదివారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 89 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆంబ్రిస్ (98 బంతుల్లో 114 నాటౌట్; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. ఓపె నర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (52; 9 ఫోర్లు), కీరన్ పావెల్ (44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టుకు శుభారంభాన్ని అందించిన అనంతరం అందరికీ ప్రాక్టీస్ దక్కేందుకు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత హెట్‌మైర్ (7), చేజ్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... హోప్ (36; 5 ఫోర్లు), డౌరిచ్ (65; 9 ఫోర్లు, 1 సిక్స్)ల అండతో ఆంబ్రిస్ జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. బోర్డు ఎలెవెన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా... సౌరభ్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు బోర్డు ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 360 పరుగులు చేసింది. -
అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్‌లో టెస్టు
న్యూఢిల్లీ: ఏడాదిన్నర పైగా విరామం తర్వాత హైదరాబాద్ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 12 నుంచి 16 మధ్య జరుగనున్న రెండో టెస్టుకు హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదిక కానుంది. తొలి టెస్టు అక్టోబర్ 4 నుంచి 8 వరకు రాజ్‌కోట్‌లో జరుగనుంది. అనంతరం వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ అక్టోబరు 21న గువాహటిలో, రెండో వన్డే 24న ఇండోర్‌లో, మూడో వన్డే 27న పుణెలో, నాలుగో వన్డే 29న ముంబైలో, ఐదో వన్డే నవంబరు 1న తిరువనంతపురంలో నిర్వహిస్తారు. నవంబరు 4న కోల్‌కతాలో, 6న లక్నోలో, 11న చెన్నైలో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత జట్టు యూఏఈలో ఈ నెల 15 నుంచి 28 వరకు సాగే ఆసియా కప్ వన్డే టోర్నీలో పాల్గొంటుంది. తర్వాత వారం వ్యవధిలోనే విండీస్‌తో తొలి టెస్టు మొదలుకానుంది. -
బంగ్లాదేశ్‌దే టి20 సిరీస్
లాడెర్‌హిల్ (అమెరికా): వెస్టిండీస్‌తో మూడు టి20ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2–1తో కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 19 పరుగుల తేడాతో విండీస్‌పై గెలుపొందింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్ లిటన్ దాస్ (32 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. మహ్మూదుల్లా (20 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. కెప్టెన్ షకీబ్ 24, తమీమ్ ఇక్బాల్ 21 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో బ్రాత్‌వైట్, కీమో పాల్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి వెస్టిండీస్ 17.1 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసి ఓడింది. రస్సెల్ (21 బంతుల్లో 47; 1 ఫోర్, 6 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పావెల్ 23, రామ్‌దిన్ 21 పరుగులు చేశారు. ముస్తఫిజుర్ రహమాన్‌కు 3 వికెట్లు దక్కాయి. లిటన్ దాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, షకీబ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించాయి. -
బంగ్లాదేశ్ గెలుపు
ఫ్లోరిడా (అమెరికా): తొలి టి20లో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ వెంటనే తేరుకొని రెండో మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 12 పరుగుల తేడాతో గెలుపొంది మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ తమీమ్ ఇక్బాల్ (44 బంతుల్లో 74; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ షకీబుల్ హసన్ (38 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో నర్స్, కీమో పాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లా బౌలర్లు నజ్ముల్ ఇస్లామ్ (3/28), ముస్తఫిజుర్ (3/50), షకీబ్ (2/19) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన విండీస్ చివరకు 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులే చేసి ఓటమి పాలైంది. -
బంగ్లాదేశ్‌దే సిరీస్
బాసెటెర్ (వెస్టిండీస్): విండీస్ గడ్డపై 2009 తర్వాత బంగ్లాదేశ్ మళ్లీ సిరీస్ గెలుచుకుంది. తాజా మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో నెగ్గింది. చివరి వన్డేలో తమీమ్ ఇక్బాల్ (124 బంతుల్లో 103; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కడంతో బంగ్లాదేశ్ 18 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బంగ్లా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. తర్వాత విండీస్ 6 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి ఓడింది. గేల్ (73; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పావెల్ (74 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హోప్ (64; 5 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. తమీమ్ ఇక్బాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘సిరీస్’ అవార్డులు లభించాయి. -
వార్మప్‌లో విండీస్‌కు అఫ్గాన్ షాక్
హరారే: ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్ వార్మప్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌కు అఫ్గానిస్తాన్ షాకిచ్చింది. పేసర్ దౌలత్ జద్రాన్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టడంతో అఫ్గాన్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 29 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 35 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో అఫ్గాన్ 71 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టెయిలెండర్లు గుల్బదిన్ నయీబ్ (48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సమీవుల్లా షెన్వారి (42; 2 సిక్సర్లు) తొమ్మిదో వికెట్‌కు 91 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. అనంతరం విండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 140 పరుగులుగా నిర్దేశించారు. అయితే గేల్ (9), శామ్యూల్స్ (34; 4 ఫోర్లు)లాంటి సీనియర్లున్న విండీస్ 26.4 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. ఇన్నిం గ్స్ 20వ ఓవర్ వేసిన జద్రాన్ వరుస బంతుల్లో హెట్‌మైర్ (1), పావెల్ (9), బ్రాత్‌వైట్ (0)లను ఔట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. -
బౌల్ట్ ధాటికి విండీస్ విలవిల
క్రైస్ట్‌చర్చ్: వెస్టిండీస్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఆ జట్టు ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోగా... ఇప్పుడు రెండో వన్డేలో ఓటమితో వన్డే సిరీస్‌నూ చేజార్చుకుంది. శనివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో పేసర్ ట్రెంట్ బౌల్ట్ (7/34) చెలరేగడంతో... న్యూజిలాండ్ 204 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 325 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ (62 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జార్జ్ వర్కర్ (53 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాస్ టేలర్ (66 బంతుల్లో 57; 5 ఫోర్లు), టాడ్ ఆస్టల్ (45 బంతుల్లో 49; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను బౌల్ట్ బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులతో కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకోవడంతోపాటు తన కెరీర్లో 100 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. బౌల్ట్‌కు తోడు ఫెర్గూసన్ (3/17) కూడా చెలరేగడంతో విండీస్ 121 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కోల్పోయింది. మూడో వన్డే మంగళవారం జరుగుతుంది. -
న్యూజిలాండ్‌దే సిరీస్
హామిల్టన్: ఊహించిన ఫలితమే వచ్చింది. మరోసారి న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్‌ను హడలెత్తించారు. ఫలితంగా రెండో టెస్టులో న్యూజిలాండ్ 240 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 444 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 30/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులకే ఆలౌటైంది. వాగ్నర్ బౌలింగ్‌లో మోచేతికి తీవ్ర గాయమైన సునీల్ ఆంబ్రిస్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. పేసర్లు వాగ్నర్ (3/42), బౌల్ట్ (2/52), సౌథీ (2/71) ధాటికి పర్యాటక జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. రోస్టన్ ఛేజ్ (64) టాప్ స్కోరర్. రాస్ టేలర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నెల 20 నుంచి రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టి20ల సిరీస్ మొదలవుతంది. -
ఓటమి దిశగా విండీస్
హామిల్టన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (107 నాటౌట్; 11 ఫోర్లు) శతకం బాదడంతో న్యూజిలాండ్... వెస్టిండీస్ ముందు 444 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. ఆట ముగిసే సమయానికి విండీస్ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ టెస్టులో విండీస్ ఓటమి ని తప్పించుకోవడం కష్టమే. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 215/8తో సోమవారం మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ మరో ఆరు పరుగులు జోడించి ఆలౌటైంది. బౌల్ట్ (4/73) రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టేలర్‌తో పాటు కెప్టెన్ విలియమ్సన్ (54; 8 ఫోర్లు) రాణించాడు. టీ విరామం అనంతరం న్యూజిలాండ్ 291/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెరీర్లో 17వ టెస్టు శతకం సాధించిన రాస్ టేలర్... తన ఆరాధ్య ఆటగాడు, కివీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ మార్టిన్ క్రో రికార్డును సమం చేశాడు. -
న్యూజిలాండ్ 286/7
హామిల్టన్: మిడిలార్డర్ విఫలమవడంతో వెస్టిండీస్‌తో శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో న్యూజిలాండ్ శుభారంభాన్ని భారీస్కోరుగా మలుచుకోలేకపోయింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు జీత్ రావల్ (84; 15 ఫోర్లు), లాథమ్ (22) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు. లాథమ్ అవుటయ్యాక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (43; 5 ఫోర్లు), రావల్ రెండో వికెట్‌కు 89 పరుగులు జత చేశారు. ఒకదశలో వికెట్ నష్టానికి 154 పరుగులతో పటిష్టంగా కనిపించిన కివీస్ రావల్, విలియమ్సన్ అవుటయ్యాక తడబడింది. రాస్ టేలర్ (16), నికోలస్ (13) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా... 189/5తో కష్టాల్లో పడిన జట్టును గ్రాండ్‌హోమ్ (58; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), శాంట్నర్ (24) ఆదుకున్నారు. వీరి మధ్య ఆరో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆట ముగిసే సమయానికి బ్లండెల్ (12 బ్యాటింగ్), వాగ్నర్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్లలో షానన్ గాబ్రియెల్ (3/79), కమిన్స్ (2/37) రాణించారు. -
హోల్డర్‌పై టెస్టు మ్యాచ్ నిషేధం
వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో సోమవారం ముగిసిన మొదటి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా హోల్డర్‌పై ఐసీసీ టెస్టు నిషేధంతో పాటు 60 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. మిగతా జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పెట్టారు. ఏప్రిల్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులోనూ విండీస్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. తాజా టెస్టులోనూ నిర్ణీత సయమానికి మూడు ఓవర్లు తక్కువ వేసింది. ఏడాదిలో రెండుసార్లు ఇలా జరగడంతో హోల్డర్ సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. -
విండీస్ విలవిల
వెల్లింగ్టన్: తొలుత పేస్ బౌలర్ నీల్ వాగ్నర్ (7/39) విజృంభణ... ఆ తర్వాత బ్యాట్స్ మన్ నిలకడ... ఫలితంగా వెస్టిండీస్‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజే న్యూజిలాండ్ జట్టు పట్టుబిగించింది. ముందుగా విండీస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్ (24; ఒక సిక్స్), కీరన్ పావెల్ (42; 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే ఇన్నింగ్స్ 22వ ఓవర్లో బ్రాత్‌వైట్‌ను అవుట్ చేసిన వాగ్నర్ విండీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. బౌల్ట్ బౌలింగ్‌లో పావెల్ నిష్క్రమించాక విండీస్ ఇన్నింగ్స్ పూర్తిగా తడబడింది. విండీస్ చివరి 9 వికెట్లను 59 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. దాంతో విండీస్ ఇన్నింగ్స్ 45.4 ఓవర్లలో 134 పరుగులకే ముగిసింది. అనంతరం న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 85 పరుగులు సాధించింది. విండీస్ బ్యాట్స్‌మన్ సునీల్ అంబ్రిస్ తానాడుతున్న తొలి టెస్టులో తొలి బంతికే హిట్ వికెట్‌గా అవుటయ్యాడు. టెస్టు క్రికెట్లో ఈ రకంగా అవుటైన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. -
రాణించిన క్రెమెర్: విండీస్ 219 ఆలౌట్
స్పిన్నర్లు గ్రేమ్ క్రెమెర్ (4/64), సీన్ విలియమ్స్ (3/20) మాయాజాలానికి విండీస్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఫలితంగా బులవాయోలో జింబాబ్వేతో శనివారం మొదలైన తొలి టెస్టులో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. ఒకదశలో 3 వికెట్లకు 174 పరుగులతో పటిష్టంగా కనిపించిన విండీస్ చివరి ఏడు వికెట్లను 45 పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. సహచరుల సహకారం లేకపోవడంతో షై హోప్ (90 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఆట ముగిసేసరికి జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. -
విండీస్ మెరిసె...
చెస్టర్ లె స్ట్రీట్: ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో విండీస్ జట్టు 21 పరుగుల తేడాతో గెలిచింది. ఎవిన్ లూయిస్ (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్ గేల్ (21 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో... విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గేల్ అంతర్జాతీయ టి20ల్లో 100 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హేల్స్ (17 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే ఆకట్టుకున్నాడు. బ్రాత్‌వైట్, విలియమ్స్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. -
పాక్‌లో విండీస్ పర్యటన ఖరారు
కేవలం మూడు టి20 మ్యాచ్‌లే కరాచీ: పాకిస్తాన్లో వెస్టిండీస్ పర్యటన ఖరారైంది. కేవలం మూడు టి20 మ్యాచ్‌లకే ఈ సిరీస్ పరిమితమైందని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ‘మా దేశంలో ఆడేందుకు వెస్టిండీస్ సమ్మతించింది. ఈ నవంబర్‌లో ముఖాముఖి సిరీస్ జరుగుతుంది. ఇరు జట్ల మధ్య లాహోర్‌లోనే మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి’ అని పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ తెలిపారు. మ్యాచ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. శ్రీలంక కూడా ఏకైక టి20 మ్యాచ్ ఆడేందుకు తమ దేశానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 29న లాహోర్‌లోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. 2009లో లాహోర్‌లో లంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆ దేశంలో ఇప్పటివరకు అంతర్జాతీయ అగ్రశ్రేణి జట్లు పర్యటించలేదు. -
విండీస్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
బెల్ఫాస్ట్: వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే క్రమంలో విజయవంతంగా తొలి అడుగు వేయా లని భావించిన వెస్టిండీస్‌కు వరుణుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఐర్లాండ్‌తో బుధవారం జరగాల్సిన ఏకైక వన్డే భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. గేల్ తదితరుల పునరాగమనంతో ఈ మ్యాచ్‌లో విజయంపై విండీస్ ఆశలు పెంచుకుంది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో విండీస్ 4–1తో గెలిస్తే సరిపోయేది. అయితే తాజా సమీకరణం ప్రకారం ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకూడదు. అంటే 5–0 లేదా 4–0తో విండీస్ ఆ సిరీస్‌ను గెలుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే శ్రీలంక నేరుగా ప్రపంచ కప్‌కు క్వాలిఫై అవుతుంది. వచ్చే ఏడాది జింబాబ్వేలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీలో విండీస్ ఆడాల్సి ఉంటుంది. -
విండీస్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదు
1980, 90 దశకాల్లో వెస్టిండీస్ జట్టు ప్రపంచ క్రికెట్‌ను శాసించినప్పటికీ ఒక్కోసారి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగానే ఆడిందని దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా అంగీకరించారు. నంబర్‌వన్‌గా ఉన్న జట్టు అందరికీ ఆదర్శంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని లారా పేర్కొన్నారు. ‘ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’పై ఉపన్యాసం ఇస్తూ లారా ఈ వ్యాఖ్యాలు చేశారు. 1988లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించేందుకు విండీస్‌కు అంపైర్ పొరపాట్లే సహకరించాయని ఆయన గుర్తు చేశారు. -
మళ్లీ క్రిస్ గేల్ వచ్చేశాడు!
వెస్టిండీస్ టాప్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు మళ్లీ పిలుపు అందింది. భారత్‌తో జరగనున్న ట్వంటీ-20 మ్యాచ్ కోసం విండీస్ జట్టులోకి అతన్నీ మళ్లీ తీసుకున్నారు. ఈ నెల 9న కింగ్స్టన్లోని సెబినా పార్క్‌లో ఈ టీ-20 మ్యాచ్ జరగనుంది. జమైకన్ ఓపెనర్ అయిన గేల్ చివరిసారిగా 2016 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇంగ్లండ్‌ను ఓడించి టీ-20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న వెస్టిండీస్ జట్టులో అతను కూడా సభ్యుడిగా ఉన్నాడు. పొట్టిక్రికెట్ ఫార్మెట్లో అత్యధిక పరుగులు చేసిన వెస్టిండీస్ ఆటగాడిగా గేల్‌కు రికార్డు ఉంది. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్‌లో టీ-20 క్రికెట్లో 10వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కూడా గేల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో గేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంటున్నట్టు వెస్టిండీస్ సెలక్టర్ల బోర్డు చైర్మన్ కౌర్ట్నీ బ్రౌన్ తెలిపాడు. టీ-20 ఫార్మెట్లో గేల్ అత్యంత నిపుణుడైన ఆటగాడని, అందుకే తమ జట్టు టాప్ ఆర్డర్ బలం చేకూర్చేందుకు అతన్ని జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు. వెస్టిండీస్ టీ-20 జట్టు ఇలా ఉండనుంది. జట్టు: కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), శామ్యూల్ బద్రీ, రాన్స్ఫోర్డ్ బీటన్, క్రిస్ గేల్, ఎవిన్ లెవిస్, జాసన్ మొహమ్మద్, సునీల్ నరేన్, కీరన్ పొల్లార్డ్, రోవ్‌మన్ పావెల్, మార్లోన్ శామ్యూల్స్, జెరోమ్ టేలర్, చాడ్విక్ వాల్టన్ (వికెట్ కీపర్), కేస్క్ విలియమ్స్. -
సెంచరీ 'మంధ' హాసం
♦ విండీస్‌పై 7 వికెట్లతో భారత్ జయభేరి ♦ రాణించిన పూనమ్, హర్మన్‌ప్రీత్ భారత అమ్మాయిల ఆల్‌రౌండ్ జోరు కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను దెబ్బతీయగా... తర్వాత లక్ష్యఛేదనలో ఓపెనర్ స్మృతి మంధన శతక్కొట్టింది. కెప్టెన్ మిథాలీ రాజ్ రాణించడంతో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టాంటన్: భారత ఓపెనర్ స్మృతి మంధన బ్యాటింగ్‌లో మళ్లీ గర్జించింది. గత మ్యాచ్‌లో సెంచరీకి 10 పరుగుల దూరంలో నిలిచిన ఆమె ఈసారి ఛేదనలో శతక్కొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత్ గత ప్రపంచకప్ రన్నరప్, టి20 చాంపియన్ వెస్టిండీస్‌ను కంగుతినిపించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దెబ్బతీసింది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (57 బంతుల్లో 43; 7 ఫోర్లు) రాణించగా, భారత బౌలర్లలో పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 42.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ స్మృతి మంధన (108 బంతుల్లో 106 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టగా, కెప్టెన్ మిథాలీ రాజ్ (88 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించింది. స్మృతికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. దెబ్బ మీద దెబ్బ టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హేలీ మాథ్యూస్, ఫెలిసియా వాల్టర్స్ శుభారంభం అందించలేకపోయారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఫెలిసియా (9) నిష్క్రమించింది. ఏక్తా బిష్త్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో సుష్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. తర్వాత హెలీకి కెప్టెన్ స్టెఫానీ టేలర్ జతయ్యింది. ఇద్దరు నింపాదిగా ఆడుతున్న దశలో హేలీ, దీప్తిశర్మకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఇక్కడి నుంచి వెస్టిండీస్ కష్టాలు మొదలయ్యాయి. భారత స్పిన్నర్లు పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ పిచ్ నుంచి సహకారం లభించడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశారు. దీంతో ఆ తర్వాత 15 ఓవర్లలో కేవలం 21 పరుగులే జతచేసిన వెస్టిండీస్ 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న టేలర్ (16) రనౌట్ కాగా... డియాండ్రా డాటిన్ (7), మెరిస్సా అగులిరా (6) పూనమ్ బౌలింగ్‌లో నిష్క్రమించారు. కైషోనా (5), చెడియాన్ నషన్ (12)లు హర్మన్‌ప్రీత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను టెయిలెండర్లు షానిల్ డాలీ (37 బంతుల్లో 33; 5 ఫోర్లు), అఫి ఫ్లెచర్ (23 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు) ఆదుకున్నారు. దీంతో ప్రత్యర్థి ముందు విండీస్ 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. చెలరేగిన స్మృతి... సునాయాస లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత మహిళలకు ఆదిలోనే పూనమ్ రౌత్ (0) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ఐదో బంతికే ఆమె కానెల్ బౌలింగ్ డకౌటైంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ దీప్తి శర్మ (6) స్టెఫానీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయింది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఓపెనర్ స్మృతి మంధన, కెప్టెన్ మిథాలీ నడిపించారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ తొలుత క్రీజ్‌లో పాతుకుపోయారు. ఆ తర్వాత తమదైన శైలిలో స్వేచ్ఛగా ఆడారు. వెస్టిండీస్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. స్మృతి 57 బంతుల్లో అర్ధసెంచరీ చేసింది. మిథాలీతో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. జట్టు స్కోరు 141 పరుగుల వద్ద మిథాలీ... హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. దీంతో మూడో వికెట్‌కు 108 పరుగులు భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత స్మృతి, మోనా మేష్రమ్(18 నాటౌట్) సహకారంతో 105 బంతుల్లో సెంచరీని పూర్తిచేయడంతో పాటు జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) అండ్ (బి) దీప్తి శర్మ 43; ఫెలిసియా (సి) సుష్మ (బి) ఏక్తాబిష్త్ 9; స్టెఫానీ టేలర్ రనౌట్ 16; డాటిన్ (సి) పూనమ్ రౌత్ (బి) పూనమ్ యాదవ్ 7; మెరిస్సా (స్టంప్డ్) సుష్మ (బి) పూనమ్ యాదవ్ 6; కైషోనా నైట్ (సి) స్మృతి (బి) హర్మన్‌ప్రీత్ కౌర్ 5; చెడియాన్ (స్టంప్డ్) సుష్మ (బి) హర్మన్‌ప్రీత్ కౌర్ 12; షానిల్ డాలీ (స్టంప్డ్) సుష్మ (బి) దీప్తి శర్మ 33; అఫి ఫ్లెచర్ నాటౌట్ 36; అనిసా మొహమ్మద్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 183. వికెట్ల పతనం: 1–29, 2–69, 3–70, 4–80, 5–91, 6–91, 7–121, 8–146. బౌలింగ్: జులన్ గోస్వామి 6–0–37–0, శిఖాపాండే 3–0–13–0, ఏక్తాబిష్త్ 10–2–23–1, దీప్తిశర్మ 10–1–27–2, మోనా మేశ్రమ్ 4–0–20–0, పూనమ్ యాదవ్ 10–2–19–2, హర్మన్‌ప్రీత్ కౌర్ 7–0–42–2. భారత్ ఇన్నింగ్స్: పూనమ్ రౌత్ (సి) మెరిస్సా (బి) కానెల్ 0; స్మృతి మంధన నాటౌట్ 106; దీప్తిశర్మ (బి) స్టెఫానీ 6; మిథాలీ (సి) అఫి ఫ్లెచర్ (బి) హేలీ మాథ్యూస్ 46; మోనా మేశ్రమ్ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (42.3 ఓవర్లలో 3 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–141 బౌలింగ్: కానెల్ 4–0–23–1, డాటిన్ 4–0–25–0, స్టెఫానీ 10–1–24–1, డాలీ 5–0–24–0, అనిసా 6–0–25–0, అఫి ఫ్లెచర్ 4–0–18–0, చెడియాన్ 1–0–9–0, హేలీ మాథ్యూస్ 8.3–0–35–1. -
విండీస్ క్లీన్‌స్వీప్
అఫ్ఘాన్‌తో టి20 సిరీస్ బసెటెరె: మార్లన్ శామ్యూల్స్ తన టి20 కెరీర్లోనే అత్యధిక స్కోరు (66 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించడంతో అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మూడో టి20లోనూ విండీస్ విజయం సాధించింది. దీంతో మూడు టి20ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (30 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నూర్ అలీ జర్దాన్ (19 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే రాణించారు. కెస్రిక్ విలియమ్స్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో మూడు వికెట్లకు 147 పరుగులు చేసి నెగ్గింది. 82 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో శామ్యూల్స్ మెరుపు బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. శామ్యూల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి.