
ఢాకా: విండీస్ విధ్వంసక ఓపెనర్ ఎవిన్ లూయిస్ (36 బంతుల్లో 89; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరిదైన మూడో టి20లో వెస్టిండీస్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. బంగ్లా పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన విండీస్ పొట్టి ఫార్మాట్‌లో సత్తా చాటింది. లూయిస్ మెరుపులకు తోడు షై హోప్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), నికోలస్ పూరన్ (29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లూయిస్ తుపానులా విరుచుకుపడటంతో 7.2 ఓవర్లలోనే విండీస్ స్కోరు 100 దాటింది.
మూడో వికెట్ రూపంలో అతను వెనుదిరిగే సమయానికి విండీస్ స్కోరు 9.2 ఓవర్లలో 122/3. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు మహ్ముదుల్లా (3/18), ముస్తఫిజుర్ (3/33), షకీబుల్ హసన్ (3/37) కట్టడి చేయడంతో విండీస్ చివరకు 190 పరుగులకు పరిమితమైంది. లక్ష్యఛేదనలో బంగ్లా 17 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (25 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 ఫోర్లు) ఒక్కడే పోరాడగా... తమీమ్ ఇక్బాల్ (8), సౌమ్య సర్కార్ (9), షకీబ్ (0), ముష్ఫికర్ రహీం (1) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 5 వికెట్లు పడగొట్టగా, అలెన్‌కు 2 వికెట్లు దక్కాయి.