మేఘమా ఉరుమకే... | India vs Bangladesh 2nd T20 At Rajkot | Sakshi
Sakshi News home page

మేఘమా ఉరుమకే...

Published Thu, Nov 7 2019 3:42 AM | Last Updated on Thu, Nov 7 2019 3:49 AM

India vs Bangladesh  2nd T20 At Rajkot - Sakshi

వానొచ్చేనంటే... ఈ మ్యాచే కాదు భారత్‌కు సిరీస్‌ గెలవడమే కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యర్థి జట్టు 1–0తో ఆధిక్యంలో ఉంది. మనం ఈ మ్యాచ్‌ గెలిస్తేనే సిరీస్‌ను సమం చేయగలుగుతాం. పైగా చివరి పోరులో ఏ ఒత్తిడి లేకుండా ఆడగలుగుతాం. అలా కాకుండా ‘మహా’ తుఫానులో ఈ ఆట ఆగమైతే మాత్రం ఆఖరి పోరులో ఒత్తిడంతా రోహిత్‌ సేన పైనే ఉంటుంది.   

రాజ్‌కోట్‌: ఇరు జట్ల ఆటగాళ్లేమో ఆడేందుకు రె‘ఢీ’ అంటున్నారు. ప్రేక్షకులేమో వీక్షించేందుకు సిద్ధమంటున్నారు. ‘మహా’ తుఫానేమో వీళ్లందరి ఉత్సాహంపై నీళ్లు చల్లేందుకు ‘సై’ అంటోంది. ఏదేమైనా ‘మహా’ గర్జించకుంటేనే ఆటయినా... టి20 మెరుపులైనా సాధ్యమయ్యేవి! తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య గురువారం ఇక్కడ రెండో టి20 జరుగనుంది.

టోర్నీలో శుభారంభం చేసిన ప్రత్యర్థి జట్టు సిరీస్‌ కైవసం చేసుకునే పనిలో పడగా... భారత్‌ తప్పకుండా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. రోహిత్‌ సేన భారమంతా బ్యాట్స్‌మెన్‌పైనే వేసింది. గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్లకు తావివ్వకుండా సిరీస్‌లో నిలవాలంటే ఇక్కడ గెలవాల్సిందే. బ్యాటింగ్‌తో పాటు బౌలర్లు కూడా శ్రమిస్తేనే బంగ్లాను ఓడించొచ్చు. లేదంటే మ్యాచ్‌నే కాదు ఏకంగా సిరీస్‌నే మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది.

‘పొట్టి’ ఆటలో గట్టి దెబ్బలే!
భారత్‌ ఇంటా బయటా బాగానే ఆడుతోంది. ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌దాకా వెళ్లింది. స్వదేశంలో టెస్టు సిరీస్‌లను వరుసబెట్టి గెలుస్తోంది. ఈ రెండు ఫార్మాట్లలో భారత్‌ అద్భుతంగా రాణిస్తోంది. కానీ పొట్టి ఫార్మాటే ఈ ఏడాది అదేపనిగా ఇబ్బంది పెడుతోంది. స్వదేశంలో ఆసీస్‌తో టి20 సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా, దక్షిణాఫ్రికాతోనూ కనాకష్టంగా సిరీస్‌ను సమం చేసుకొని బయటపడింది.

అప్పుడు రెగ్యులర్‌ సారథి, బ్యాటింగ్‌ సంచలనం కోహ్లి ఉన్నప్పటికీ అలాంటి ఫలితాలొచ్చాయి. ఇప్పుడు అతను విశ్రాంతిలో ఉన్నాడు. దీంతో మరింత ఒత్తిడితో అదే ముప్పు ముంచుకొచి్చంది. ఇప్పటిదాకా బంగ్లాపై పొట్టి ఫార్మాట్‌లో ఎదురులేని రికార్డున్న భారత్‌... తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇప్పుడు ఎలాగైనా గెలవాలనే గడ్డు పరిస్థితుల్లో జట్టు నిలిచింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌లాంటి జట్టుతో ఓడితే మాత్రం జీరి్ణంచుకోలేని పరాభవం మిగులుతుంది.

నాయకుడే నడిపించాలి...
ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మినహా ఇంకెవరూ పెద్దగా రాణించలేదు. తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ విఫలమయ్యాడు. ఇప్పుడు గెలిచి నిలవాల్సిన పరిస్థితిలో అతను కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం వచి్చంది. హిట్టర్‌ లోకేశ్‌ రాహుల్, యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్‌లు కూడా తమ బ్యాట్లకు పనిచెప్పాలి. జట్టులో స్థానం కోసం ఎంతో పోటీ ఉన్న నేపథ్యంలో అందివచి్చన అవకాశాల్ని కుర్రాళ్లు సది్వనియోగం చేసుకోవాలి. లోయర్‌ మిడిలార్డర్‌లో కృనాల్‌ పాండ్యా కూడా ధాటైన ఇన్నింగ్స్‌ ఆడితే పరుగుల ప్రవాహం పెరుగుతుంది. ప్రత్యర్థి ముందు గెలిచే లక్ష్యాన్ని నిర్దేశించగలుగుతుంది. తొలి మ్యాచ్‌లో పసలేని బౌలింగ్‌ కూడా భారత్‌ను ముంచింది.  

జోరు మీదున్న బంగ్లా...
నిజానికి పొట్టి ఫార్మాట్‌లో ఫేవరెట్లంటూ ఉండరు...! ఆ రాత్రి ఎవరు మెరిపిస్తే వాళ్లే గెలుస్తారు. మొదటి మ్యాచ్‌లో బంగ్లా చేసింది అదే! ఇప్పుడు ఏకంగా సిరీస్‌ను చేజిక్కించుకునే మ్యాచ్‌ ఆడనుంది. గత మ్యాచ్‌లో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ ఒక్కడే విఫలమయ్యాడు. నయీమ్, సర్కార్‌ విలువైన పరుగులు జతచేశారు. దీనికి ముష్ఫికర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ జతకావడంతో టి20ల్లో భారత్‌పై తొలి విజయం సాకారమైంది. ఈ విజయమిచి్చన ఆత్మవిశ్వాసంతో బంగ్లా జట్టు మళ్లీ చెలరేగేందుకు తహతహలాడుతోంది. 

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ (కెపె్టన్‌), ధావన్, రాహుల్‌/సామ్సన్, శ్రేయస్, రిషభ్‌ పంత్, శివమ్‌ దూబే, కృనాల్‌ పాండ్యా, సుందర్, చహల్, దీపక్‌ చహర్, శార్దుల్‌/ఖలీల్‌ అహ్మద్‌.
బంగ్లాదేశ్‌: మహ్ముదుల్లా (కెపె్టన్‌), లిటన్‌ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్‌/    మిథున్, ముషి్ఫకర్‌ రహీమ్, మొసద్దిక్‌ హుస్సేన్, అఫిఫ్‌ హుస్సేన్, ఇస్లామ్, ముస్తఫిజుర్, అల్‌ అమిన్‌/సన్నీ అరాఫత్, షఫీయుల్‌.

►1 ఈ మ్యాచ్‌ ద్వారా రోహిత్‌ శర్మ భారత్‌ తరఫున 100 అంతర్జాతీయ టి20  మ్యాచ్‌లు ఆడనున్న తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందనున్నాడు. ఇంతకుముందు ధోని 98 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా 100 అంతర్జాతీయ టి20  మ్యాచ్‌లు ఆడనున్న రెండో క్రికెటర్‌గా రోహిత్‌ నిలువనున్నాడు. ఈ జాబితాలో షోయబ్‌ మాలిక్‌ (పాకిస్తాన్‌–111 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్‌కే చెందిన షాహిద్‌ అఫ్రిది 99 మ్యాచ్‌లు ఆడి రిటైరయ్యాడు.

►1 రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎస్‌సీఏ) మైదానంలో ఇప్పటివరకు భారత్‌ రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో నెగ్గి, మరో మ్యాచ్‌లో ఓడింది. 2013లో ఆ్రస్టేలియా (201/7; 20 ఓవర్లలో)తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ (202/4; 19.4 ఓవర్లలో) ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 2017లో న్యూజిలాండ్‌ (196/2; 20 ఓవర్లలో)తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ (156/7; 20 ఓవర్లలో) 40 పరుగుల తేడాతో ఓడిపోయింది.

పిచ్, వాతావరణం
గతంలో ఇక్కడ జరిగిన రెండు టి20ల్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈసారి కూడా పిచ్‌ బ్యాటింగ్‌కే అనుకూలంగా కనిపిస్తోంది కాబట్టి మళ్లీ పరుగుల ప్రవాహం చూసే వీలుంది. నేటి మధ్యాహ్నంకల్లా ‘మహా’తుఫాన్‌ బలహీన పడుతుందని... సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతంగా ఉంటుందని... రాత్రి వేళలో మాత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.   

గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వం. ఇక్కడి పిచ్‌ బాగుంది. ఈ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. పెద్ద స్కోర్లు ఖాయం. పొట్టి ఫార్మాట్‌ కొత్త ఆటగాళ్లను పరీక్షించేందుకు అనుకూలంగా ఉంటుంది. వచ్చే టి20 ప్రపంచకప్‌ నాటికి రిజర్వ్‌బెంచ్‌ సత్తా పెంచడమే లక్ష్యం.
–భారత కెపె్టన్‌ రోహిత్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement