మొదటి మ్యాచ్‌లో ఓడి... రెండో దానిని ‘టై’గా ముగించి... సిరీస్‌లో పుంజుకున్న వెస్టిండీస్ మూడో వన్డేలో ఏకంగా గెలుపునే సొంతం చేసుకుంది. బౌలింగ్ బలాన్ని కూడదీసుకుని మరీ బరిలో దిగిన భారత్... బ్యాటింగ్‌లో బలహీనతలను మాత్రం అధిగమించలేకపోయింది. టాపార్డర్‌పై అతిగా ఆధారపడి బోల్తా కొట్టింది. ఛేదనలో మొనగాడైన కెప్టెన్ విరాట్ కోహ్లి 38వ శతకం బాదినా... మిగతా అందరూ బ్యాట్లెత్తేయడంతో టీమిండియా ఓటమి మూటగట్టుకుంది. ప్రత్యర్థి లోయరార్డర్ పోరాడి జోడించిన పరుగులే మ్యాచ్‌లో తేడాను చూపాయి.
పుణే: ఎట్టకేలకు వెస్టిండీస్‌కో విజయం. భారత పర్యటనలో గెలుపునకు మొహం వాచిన ఆ జట్టు మూడో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దానిని అందుకుంది. మరోవైపు బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో టీమిండియాకు పరాజయం ఎదురైంది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు 43 పరుగులతో కోహ్లి సేనను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. శతకం చేజారినా, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ షై హోప్ (113 బంతుల్లో 95; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. యువ హెట్‌మైర్ (21 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆష్లే నర్స్ (22 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ జాసన్ హోల్డర్ (39 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) తలో చేయి వేశారు. బుమ్రా (4/35) ప్రత్యర్థిని కట్టడి చేయడంతో పాటు కీలక వికెట్లు పడగొట్టాడు. 284 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ విరాట్ కోహ్లి (119 బంతుల్లో 107; 10 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగినా... ఓపెనర్ శిఖర్ ధావన్ (45 బంతుల్లో 35; 5 ఫోర్లు) మినహా ఇంకెవరూ రాణించకపోవడంతో భారత్ 47.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో శామ్యూల్స్ (3/12) మూడు వికెట్లు తీయగా, హోల్డర్, మెకాయ్, నర్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. నాలుగో వన్డే సోమవారం ముంబైలో జరుగుతుంది.
ఇటు ‘హోప్’... అటు నర్స్
ఓపెనర్లు కీరన్ పావెల్ (21), హేమరాజ్ (15)లను బుమ్రా తక్కువ స్కోర్లకే ఔట్ చేయడం, శామ్యూల్స్ (9) వైఫల్యంతో విండీస్ ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ, హోప్, హెట్‌మైర్ జోడీ మరోసారి నిలిచింది. ముఖ్యంగా హెట్‌మైర్... స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లను లక్ష్యంగా చేసుకున్నాడు. అయితే, కుల్దీప్ బౌలింగ్‌లో ధోని మెరుపు స్టంపింగ్ అతడి దూకుడుకు తెరదించింది. బుమ్రా, భువీ రెండో స్పెల్‌లో పరుగులు రావడం కష్టంగా మారినా హోప్ మాత్రం పట్టువదలకుండా ఆడాడు. 72 బంతుల్లో అర్ధ శతకం పూర్తిచేసుకున్నాక ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఖలీల్ ఓవర్లలో రెండు సిక్స్‌లు కొట్టాడు. హోల్డర్ అండగా నిలిచాడు. అతడితో పాటు, ఫాబియాన్ అలెన్ (5) నిష్క్రమించడం, హోప్‌ను బుమ్రా యార్కర్‌తో బౌల్డ్ చేయడంతో విండీస్ 227/8కు పడిపోయింది. ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగదనుకుంటుండగా నర్స్ అడ్డుపడ్డాడు. గత మ్యాచ్‌లో చివరి ఓవర్లో విజయానికి అవసరమైన పరుగులు చేయడంలో విఫలమైన అతడు... ఈసారి పూర్తి భిన్నంగా కనిపించాడు. చహల్ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ బాదాడు. 49వ ఓవర్లో భువీకి మూడు బౌండరీలు, సిక్స్‌తో చుక్కలు చూపాడు. దీంతో భువీ ఏకంగా 21 పరుగులు ఇచ్చుకున్నాడు. 9వ వికెట్ రోచ్ (15 నాటౌట్)తో కలిసి 35 బంతుల్లోనే 50 పరుగులు జోడించాడు.
కోహ్లి ఒక్కడే...
తక్కువ ఎత్తులో వచ్చిన హోల్డర్ బంతిని ఆడలేకపోయిన రోహిత్ శర్మ (8) మరోసారి త్వరగానే ఔటవ్వడంతో ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. రెండో వికెట్‌కు కోహ్లితో 79 పరుగులు జోడించి కుదురుకున్నట్లే కనిపించిన ధావన్... నర్స్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కు యత్నించి ఎల్బీ అయ్యాడు. ఎప్పటిలానే పరుగులు రాబట్టిన కోహ్లి 63 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్‌కు అంబటి రాయుడు (22) సహకారమందించడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. అయితే, మెకాయ్ బంతిని వికెట్ల మీదకు ఆడుకుని రాయుడు పెవిలియన్ చేరాడు. వస్తూనే లైఫ్ దక్కిన రిషభ్ పంత్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని మెరుపు షాట్లు కొట్టినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సాధికారికంగా ఆడుతూ, 90ల్లో ఉన్న కోహ్లికి తోడ్పాటునివ్వడంతో పాటు జట్టును గెలుపు తీరానికి చేర్చాల్సిన దశలో వచ్చిన ధోని (7) వైఫల్యాల పరంపర కొనసాగించాడు. వికెట్‌కు దూరంగా హోల్డర్ వేసిన బంతిని బ్యాట్‌కు తగిలించుకుని కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే, హోల్డర్ మరుసటి ఓవర్లో సింగిల్‌తో కోహ్లి శతకం (110 బంతుల్లో) అందుకున్నాడు. బ్యాటింగ్ చేయగలిగిన భువనేశ్వర్ (10)తో కలిసి కెప్టెన్ గెలిపిస్తాడని అభిమానులు భావిం చారు. కానీ, కోహ్లిని శామ్యూల్స్ బౌల్డ్ చేయడంతో ఆశలు నీరుగారాయి.
►మూడు వరుస సెంచరీలు చేసిన తొలి కెప్టెన్ విరాట్ కోహ్లినే.
Comments
Please login to add a commentAdd a comment