
ఆసీస్ మహిళలదే వన్డే సిరీస్
భారత్‌పై 2-0తో కైవసం
హోబర్ట్: పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపిన భారత మహిళల జట్టు... వన్డే సిరీస్‌లో మాత్రం చేతులెత్తేసింది. లక్ష్య ఛేదనలో నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా... శుక్రవారం జరిగిన రెండో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. బెల్లెరివ్ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. స్మృతి మందన (109 బంతుల్లో 102; 11 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా, మిథాలీ రాజ్ (58), శిఖా పాండే (33 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (21) మెరుగ్గా ఆడారు.
పెర్రీ 3, షుట్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఆసీస్ 46.4 ఓవర్లలో 4 వికెట్లకు 253 పరుగులు చేసింది. బోల్టన్ (77), లాన్నింగ్ (61), పెర్రీ (31), జొనాసేన్ (29 నాటౌట్), హీలే (29 నాటౌట్) గెలుపునకు అవసరమైన పరుగులు జత చేశారు. శిఖా పాండే, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు తీశారు. మందనకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి వన్డే ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది.