సోమ్‌దేవ్ వీడ్కోలు
అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌కు ముగింపు
న్యూఢిల్లీ: భారత మాజీ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 31 ఏళ్ల సోమ్‌దేవ్‌ను గత కొన్నేళ్లుగా గాయాలు పదేపదే ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో కొత్త సంవత్సరం తొలిరోజైన ఆదివారం ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించాడు. ‘రిటైర్మెంట్‌తో 2017ను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నా. నా కెరీర్ ఆసాంతం సహకరించిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఊహ తెలిసినప్పటి నుంచి టెన్నిసే ప్రపంచంగా పెరిగిన తనలో ఇపుడా ఆశ లేదని... ఆడాలన్న తపన ఏమాత్రం లేదని, అందుకే రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని రాకెట్‌ను వదిలేస్తున్నట్లు చెప్పాడు. కష్టకాలంలో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఎప్పుడు అండగా నిలువలేదని తన అసంతృప్తిని వెలిబుచ్చాడు.
సరైన వ్యవస్థ లేదు: ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా ఎదిగేందుకు భారత్‌లో సరైన వ్యవస్థేలేదని ‘ఐటా’ను ఉద్దేశించి సోమ్‌దేవ్ అన్నాడు. భారత డేవిస్ కప్ జట్టు కోచ్ పదవి కోసం ప్రయత్నించలేదని చెప్పాడు. సింగిల్స్‌లో అతని కెరీర్ బెస్ట్ ర్యాంకు 62. 2009లో చెన్నై ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సోమ్‌దేవ్ ఏటీపీ సర్క్యూట్ సింగిల్స్‌లో 62 మ్యాచ్‌లు గెలువగా... 81 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు. డబుల్స్ బెస్ట్ ర్యాంకు 139 కాగా...19 మ్యాచ్‌ల్లో గెలిచి 26 మ్యాచ్‌ల్లో ఓడాడు. ప్రస్తుతం సోమ్‌దేవ్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 909వ స్థానంలో ఉన్నాడు. 2012లో భుజం గాయం అతని కెరీర్‌ను బాగా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ అడపాదడపా ఆడటం మళ్లీ ఆటకు దూరమవడం పరిపాటిగా మారింది.