ఆట తర్వాతే ఎవరైనా
నాలో ఇంకా చాలా క్రికెట్ ఉంది
ఈ ప్రపంచకప్‌తో వెలితి తీరింది
మహేళ జయవర్ధనే ఇంటర్వ్యూ
ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఉండే ఆనందం ఏమిటో శ్రీలంక క్రికెటర్లను చూస్తే తెలుస్తుంది. మ్యాచ్ ముగిసి హోటల్‌కు వెళ్లిన తర్వాత కూడా ఆటగాళ్లంతా ఇంకా ఆ విజయం తాలూకు ‘మత్తు’ను ఆస్వాదిస్తూనే ఉన్నారు. యువ క్రికెటర్ల ఉత్సాహం అంబరాన్నంటితే... సీనియర్ క్రికెటర్లలో మాత్రం పెద్ద రిలీఫ్. ఐదుసార్లు ప్రపంచకప్ (వన్డే, టి20 కలిపి) ఫైనల్స్ ఆడటం సామాన్యమైన విషయం కాదు. అయినా చివరి ప్రయత్నంలో టైటిల్ గెలవడంలో లభించే ‘కిక్’ ఇంకా మధురంగా ఉంటుంది. ఈ ప్రపంచకప్‌తో తనలో ఉన్న ఓ ‘వెలితి’ తీరిందంటున్న శ్రీలంక స్టార్ క్రికెటర్ మహేళ జయవర్ధనే ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.
విజయంతో వీడ్కోలు పలకడంపై కామెంట్?
అద్భుతమైన ఫీలింగ్. మాటల్లో చెప్పలేని ఆనందం. సుదీర్ఘ కెరీర్‌లో చాలా వ్యక్తిగత రికార్డులు సాధించినా ఓ ప్రపంచకప్ లేదనే వెలితి ఉండేది. అది దీనితో తీరిపోయింది.
నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోవడం, ఆఖరి మ్యాచ్ అని తెలిసి ఆడటం ఎలాంటి ఒత్తిడి?
ఫైనల్స్‌లో ఓడిపోవడం సహజంగానే నిరాశను కలిగిస్తుంది. అలాగే పెద్ద మ్యాచ్ ఆడే సమయంలో ఒత్తిడి ఉంటుంది. కానీ అనుభవంతో దానిని జయించగలిగే సామర్థ్యం వస్తుంది. ఆఖరి మ్యాచ్ అనే భావన మైదానంలో దిగాక ఉండదు. క్రీజులో ఉన్నంతసేపు ఫోకస్ ఆట మీదే ఉండాలి. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా ఒత్తిడి లేదు. ఎలాగైనా గెలవాలనే తపన మాత్రం ఉంది.
లంక క్రికెట్‌కు సంగక్కర సేవల గురించి?
అద్భుతమైన క్రికెటర్. నా జీవితంలో మైదానంలో ఎక్కువసేపు గడిపింది అతనితోనే. లంక క్రికెట్‌లో చెరగని ముద్ర సంగక్కరది. వ్యక్తిగా కూడా చాలా మంచివాడు. ఎంతో పరిణతి చెందిన క్రికెటర్. జట్టు కోసం ఎప్పుడూ ముందుంటాడు. సంగక్కర ఆడుతున్నాడంటే మాలో ఒక రకమైన ధీమా.
టి20 ఫైనల్లో సంగక్కర ఇన్నింగ్స్ గురించి?
మ్యాచ్‌కు ముందు అతని ఫామ్ గురించి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. కానీ ఫామ్ కంటే క్లాస్ శాశ్వతం. అతని సామర్థ్యం ఏమిటనేది మాకు తెలుసు. అతను క్రీజులో ఉన్నంతసేపు విజయం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. అందులోనూ లక్ష్యం చిన్నదే కాబట్టి మరింత ధీమాగా ఉన్నాం.
టి20ల్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరై ఉండి ఈ ఫార్మాట్ వదులుకోవడం ఎందుకు?
టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్‌లకే నా ప్రాధాన్యం ఎక్కువ. నాలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. అయితే ఈ ఫార్మాట్‌లో కొత్త క్రికెటర్లు రావడం ద్వారా వాళ్లకి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్స్‌పోజర్ వస్తుంది. దీనిలో అనుభవంతో క్రమంగా వన్డేలు, టెస్టుల్లోకీ వస్తారు.
మీ స్థానాలని భర్తీ చేయగలవారు ఉన్నారా?
ఏ రంగంలో అయినా కొత్త నీరు వస్తుంటే పాత నీరు వెళ్లిపోవాల్సిందే. ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఆట తర్వాతే ఎవరైనా. శ్రీలంక క్రికెట్‌లో నైపుణ్యానికి కొదువలేదు. కచ్చితంగా యువ క్రికెటర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనే నమ్మకం నాకుంది.
ఫైనల్లో గెలుస్తామనే నమ్మకం ఎప్పుడు కలిగింది?
భారత్ అంత తక్కువ స్కోరు దగ్గర ఆగిపోతుందని అనుకోలేదు. 130 పరుగులు ఎలాంటి పిచ్‌పైనైనా ఈ ఫార్మాట్‌లో చేయొచ్చు. మా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. కాబట్టి విజయంపై పూర్తి విశ్వాసం వచ్చింది.
దేవుడు మీవైపు ఉన్నాడన్న స్యామీ, కోహ్లి వ్యాఖ్యలపై కామెంట్?
నిజమేనేమో. వాళ్లిద్దరూ గొప్ప క్రికెటర్లు. ప్రత్యర్థి జట్టులోని క్రికెటర్లను గౌరవించడం వారి సంస్కారం.