ధోనీ బ్యాట్ సౌండే.. భారత్‌కు విజయఢంకా!
న్యూఢిల్లీ: ఇటీవల ఆసియా కప్‌లో మహేంద్రసింగ్ ధోనీ ఆడుతుండగా.. ఆయన బ్యాటు నుంచి వచ్చిన 'సౌండ్' విన్నారా? ధాటిగా, దీటుగా వెలువడిన ఆ శబ్దం.. ధోనీ పాజిటివ్ మైండ్‌సెట్‌కు (సానుకూల దృక్పథానికి) నిదర్శనమని, టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఇందెంతో శుభసంకేతమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు.
ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్‌గా భారత సారథి ధోనీకి మంచి పేరుంది. అయితే నిన్నమొన్నటివరకు ఫామ్‌లో లేక ఈ కూల్ కెప్టెన్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆసియా కప్‌లో మళ్లీ దూకుడుగా ఆడుతూ బెస్ట్ ఫినిషర్ అని తనను ఎందుకంటారో మరోసారి నిరూపించుకున్నాడు మహీ.
ఈ నేపథ్యంలో సచిన్ ఓ చానెల్‌తో మాట్లాడుతూ ' ప్రపంచంలో ఏ ఆటగాడైనా తన కెరీర్ మొత్తం మంచి ఫామ్‌లో కొనసాగాలంటే కుదరదు. ఎందకంటే ఆటగాళ్లు యంత్రాలు కాదు. ధోనీ బ్యాటును బంతి తాకినప్పుడు వచ్చిన శబ్దాన్ని నేను విన్నప్పుడు.. అది విభిన్నమైన శబ్దంగా నాకు అనిపించింది. బ్యాట్స్‌మన్ భిన్నమైన మైండ్‌సెట్‌తో ఉన్నాడని చెప్పేందుకు ఆ సౌండ్ నిదర్శనం' అని అన్నాడు.
'ధోనీకి ఉన్న అతిపెద్ద ఆస్తి.. అతడు ఒత్తిడిని అవలీలగా పీల్చుకోగలగడమే. అదే అతన్ని మంచి కెప్టెన్‌ను చేసింది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ అతను మరింత పరిణతి సాధిస్తున్నాడు. ఒత్తిడిలో ఉన్నట్టు అతను ఎప్పుడూ కనబడడు. ఇది జట్టుకు మంచి సంకేతం. కెప్టెన్ కోపం ప్రదర్శించడం లేదా నెర్వెస్‌గా ఫీలవ్వడం జట్టులో భయాన్ని కలిగిస్తుంది. అలాంటి పరిస్థితి ధోనీతో రాదు' అని సచిన్ విశ్లేషించాడు. ధోనీ ఫామ్‌లోకి రావడం, యువీ తిరిగి సత్తా చాటుతుండటం భారత్‌కు కలిసొచ్చే అంశమని, అయితే టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు 'గేమ్ చేంజర్'గా జస్ప్రీత్ బూమ్రా నిలిచే అవకాశముందని, అతను డిసెప్టివ్ యాక్షన్‌తో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడని సచిన్ చెప్పాడు. ఫ్లెక్సిబిలిటీయే భారత జట్టులో బెస్ట్ అంశమని పేర్కొన్నాడు.