'మాపై గంగూలీ దూకుడు సెపరేటు'
కోల్కతా: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్కు దూకుడును అలవాటు చేయడంలో గంగూలీ తనదైన ముద్రవేశాడన్నాడు. ప్రత్యేకంగా ఆస్ట్రేలియాతో జరిగే పోరులో గంగూలీ మరింత దూకుడు వ్యవహరించే తీరు ఆకట్టుకునేదని హేస్టింగ్ కొనియాడాడు. ఆస్ట్రేలియాకు వచ్చి ఆసీస్పై ఆ రకమైన దూకుడును ప్రదర్శించిన వారి జాబితాను చూస్తే గంగూలీనే తొలి క్రికెటర్ గా నిలుస్తాడని హేస్టింగ్స్ తెలిపాడు.
గంగూలీ కెప్టెన్ గా ఉన్న 2000 నుంచి 2005 సమయంలో అతని శైలి చాలా భిన్నంగా ఉండేదన్నాడు. ఒకానొక సందర్భంలో అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వాను టాస్ కోసం నిరీక్షించేలా చేసిన ఘనత గంగూలీ దక్కుతుందన్నాడు. ఇదే తరహాలో ఆస్ట్రేలియన్లను గంగూలీ భయపెట్టే సందర్భాలను కూడా తాను చాలా చూశానన్నాడు. కాగా, భారత్-ఆస్ట్రేలియా జట్లు ఎప్పుడూ క్రికెట్ను ఆరాధిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. దాంతో పాటు ఇరు జట్లలో ఆత్మవిశ్వాసం కూడా మెండుగానే ఉందన్నాడు. అయితే ప్రస్తుత ఆస్ట్రేలియా-టీమిండియా జట్లలో ఆనాటి దూకుడు లేదన్న విషయాన్ని అంగీకరించాలన్నాడు. అత్యంత నమ్మకంతో పాటు సహజసిద్ధంగా ఆడటమే తాను ఇప్పుడు ఇరు జట్లలో చూస్తున్నట్లు హేస్టింగ్స్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ ఐపీఎల్ ఆడటంతో తనకు భారత్ లో చాలా మంది స్నేహితులున్నట్లు పేర్కొన్నాడు. పేస్ బౌలింగ్ విషయానికొస్తే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పరిస్థితులకు, భారత్ లో పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నాడు.