నా నమ్మకాన్ని నిలబెట్టాడు: గంగూలీ
న్యూజిలాండ్ తో ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ స్డేడియంలో జరగుతున్న రెండో టెస్టులో భారత జట్టులోకి పేసర్ భువనేశ్వర్ కుమార్ ను తీసుకోవడం కలిసొచ్చిందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భువీకి అవకాశం కల్పించిన టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని అభినందించాడు. గత మూడేళ్లలో ఇక్కడ ఐదు వికెట్ల ఇన్నింగ్స్(5/33) ఫీట్ నమోదు చేసిన తొలి భారత పేసర్ భువీ అని కొనియాడాడు. నాగ్ పూర్ టెస్టు తర్వాత కోల్ కతాలో పేసర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని చేసిన సూచనలు బాగా పనికిరావడంపై హర్షం వ్యక్తంచేశాడు.
పిచ్ పై పచ్చిక ఉన్నప్పుడు పేసర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు సందిస్తే భువీ తరహాలోనే అద్భుత ఫలితాలు రాబట్టవచ్చునని అభిప్రాయపడ్డాడు. ఈడెన్ టెస్టు రెండు రోజుల్లో భువీ అందరికంటే ప్రత్యేకమన్నాడు. ఇటీవల కరీబియన్ లో వెస్డిండీస్ తో టెస్టు సిరీస్ లోనూ తొలి రెండు టెస్టుల్లోనూ భువనేశ్వర్ కు అవకాశమివ్వలేదు. అనూహ్యంగా మూడో టెస్టులో చోటు దక్కించుకున్న భువీ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీయడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రస్తుత సిరీస్ లో కివీస్ తో తొలి టెస్టులో అవకాశం రాకున్నా బాధపడలేదు.. ఎంతో నిబద్ధతతో రెండో టెస్టులో తానేంటో భువీ నిరూపించుకున్నాడని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూలీ చెప్పుకొచ్చాడు. భువీ దాటికి రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి 34 ఓవర్లాడిన కివీస్ 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.