ఆ గొడవలో గంగూలీ ప్రస్తావన!
న్యూఢిల్లీ: ఢిల్లీలో రంజీమ్యాచ్ సందర్భంగా శనివారం బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ, ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవలో సౌరవ్ గంగూలీ ప్రస్తావన కూడా వచ్చింది. ఈ గొడవలో బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన గంగూలీ గురించి కూడా వ్యాఖ్యలు చేశారని మనోజ్ తీవారి ఆదివారం విలేకరులకు తెలిపాడు.
'గొడవ అనంతరం నిన్న నేను గంగూలీతో మాట్లాడాను. మైదానంలో గొడవ సందర్భంగా ఆయన పేరు కూడా వినిపించింది. కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందుకే నేను చాలా అప్‌సెట్ అయ్యాను. మేం బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు వస్తే మేం వినలేం. స్లెడ్జింగ్ మంచిదే కానీ ఎంతమేరకు మాట్లాడాలి? గీత దాటకుండా ఎలా ఉండాలి క్రీడాకారులకు తెలిసి ఉండాలి' అని మనోజ్ తివారీ పేర్కొన్నారు.
సమయం వృథా చేయడంతోనే మైదానంలో ఈ గొడవ జరిగిందని, దానివల్లే గంభీర్ కల్పించుకోవాల్సి వచ్చిందని తనపై వస్తున్న ఆరోపణలను మనోజ్ తివారీ తోసిపుచ్చారు. ఆటలో జాప్యం జరిగిన సంగతి వాస్తవమేనని, అయితే అది ఉద్దేశపూరితంగా చేసింది కాదని పేర్కొన్నారు.