
ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆపద్బాంధవుడు ఆమ్లా నిలిచాడు. కెప్టెన్ డు ప్లెసిస్ కుదురుకున్నాడు. ఇంకా డికాక్ రావాల్సి ఉంది. పరిస్థితి చూస్తే ఆతిథ్య జట్టు ఆధిపత్యంతో తొలి రోజు ముగిసేలా ఉంది. కానీ భారత్ పుంజుకుంది. రెండు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. సెంచూరియన్ టెస్టులో తేరుకుంది. రెండో రోజు భారత్ చేయాల్సిందల్లా దక్షిణాఫ్రికాను సాధ్యమైనంత త్వరగా ఆలౌట్ చేయడం... బ్యాటింగ్‌లో ప్రతాపం చూపడం!
సెంచూరియన్: ఒకరు ఇబ్బందిగా కదిలితే... మరొకరు సాధికారికంగా ఆడారు... ఇంకొకరు నిలదొక్కుకుంటే... అవతలివైపు వారు దూకుడు చూపారు... తమకు పెట్టని కోటలాంటి రెండో టెస్టు వేదిక సూపర్ స్పోర్ట్ పార్క్ పిచ్‌పై శనివారం సఫారీల ఇన్నింగ్స్ సాగిన తీరిది. అప్పుడప్పుడు ఓ వికెట్ అన్నట్లుగా సాగిన భారత్ బౌలింగ్‌ను రెండు సెషన్ల పాటు ధీమాగా ఆడింది. ప్రతి బ్యాట్స్‌మన్ తలా కొన్ని పరుగులు అందించడంతో మెరుగైన స్కోరు దిశగా కదిలింది. అయితే... చివర్లో రనౌట్లతో తడబడి వికెట్లు చేజార్చుకుంది. అంతకుముందు ఓపెనర్ ఐడెన్ మార్క్‌రమ్ (150 బంతుల్లో 94; 15 ఫోర్లు), డిపెండబుల్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా (153 బంతుల్లో 82; 14 ఫోర్లు) రాణించడంతో ప్రొటీస్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 269 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (77 బంతుల్లో 24 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (23 బంతుల్లో 10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌కు ఒకటి దక్కింది.
రెండు సెషన్లు వారివే...
పేస్ స్వర్గధామంగా పేరొందిన పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు ఎల్గర్ (83 బంతుల్లో 31; 4 ఫోర్లు), మార్క్‌రమ్ పట్టుదలగా ఆడారు. ఎల్గర్ తడబడుతుండటంతో స్పిన్నర్ అశ్విన్‌ను ముందే బౌలింగ్‌కు దింపినా లంచ్ వరకు భారత్‌కు వికెట్ దక్కలేదు. తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించాక అతడు అశ్విన్‌కే చిక్కాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఆమ్లా కూడా ఏమంత సౌకర్యంగా కనిపించలేదు. 14, 30 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. మార్క్‌రమ్ మాత్రం మొదటి నుంచి చక్కగా ఆడాడు. పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీలు కొట్టాడు. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాక... శతకం ఖాయం అనుకుంటున్న దశలో అశ్విన్ బౌలింగ్‌లో లేట్ కట్‌కు యత్నించి పార్థివ్ పట్టిన చురుకైన క్యాచ్‌కు అతను వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ (48 బంతుల్లో 20; 2 ఫోర్లు) తన సహజ తీరుతో ఆడేందుకు యత్నించాడు. రివర్స్ స్వీప్‌తో ఫోర్ కొట్టాడు. మూడో వికెట్‌కు 51 పరుగులు జత చేశాక... ఇషాంత్ బంతిని వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డయ్యాడు. ఈ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 199. తర్వాత ఆమ్లా, డుప్లెసిస్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడారు.
పాండ్యా ఈసారి రనౌట్లతో...
మరో 9 ఓవర్లే మిగిలాయి. స్కోరు 246/3. దీంతో దక్షిణాఫ్రికా మెరుగ్గానే రోజును ముగించేలా కనిపించింది. ఇక్కడే... హార్దిక్ పాండ్యా ఆటను మలుపు తిప్పాడు. తొలి టెస్టులో ఇటు బ్యాట్, అటు బంతితో ముద్ర వేసిన ఈ యువ ఆల్‌రౌండర్ ఈసారి రనౌట్ల రూపంలో జట్టుకు ఉపయోగ పడ్డాడు. తన బౌలింగ్‌లో బంతిని షార్ట్ లెగ్‌లోకి ఆడి పరుగుకు ప్రయత్నించిన ఆమ్లాను అతడు డైరెక్ట్ హిట్ ద్వారా పెవిలియన్‌కు పంపాడు. ఫాలో త్రూలో బంతిని అందుకుని మరీ నేరుగా వికెట్లకు కొట్టిన ఈ రనౌట్ తొలి రోజు ఆటలో హైలైట్. పాండ్యా మరుసటి ఓవర్‌లోనే ఫిలాండర్ లేని పరుగుకు యత్నించి అవుటయ్యాడు. ఈసారీ పాండ్యా ఫాలో త్రూలో బ్యాట్స్‌మన్ క్రీజు వద్దకు వచ్చి పార్థివ్ నుంచి బంతిని అందుకుని వికెట్లను గిరాటేయడం గమనార్హం. అంతకుముందు డికాక్ (0)ను అద్భుత బంతితో అశ్విన్ వెనక్కి పంపడంతో ప్రత్యర్థి 5 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయింది. ఒక్కసారిగా 251/6కు పడిపోయింది.
అశ్విన్ చమక్...
సెంచూరియన్‌లో అసలు స్పిన్నర్‌కు చోటుంటుందా అని భావించే పరిస్థితుల్లో కూడా రవిచంద్రన్ అశ్విన్ (3/90) ప్రభావం చూపాడు. 20వ ఓవర్‌లోనే బౌలింగ్‌కు దిగి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 31 ఓవర్లు వేయడంతో పాటు ఓపెనర్లు సహా ప్రమాదకర డికాక్‌ను అవుట్ చేశాడు. అశ్విన్ బౌలింగ్ బాగా పడుతుండటం చూసి కోహ్లి... సుదీర్ఘ స్పెల్స్(17–8–6) వేయిం చాడు. దీనికి తగ్గట్లే అతడు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
మన పేస్ సాదాసీదాగానే...
భారత్ బౌలింగ్ దాడిని బుమ్రా, షమీ ప్రారంభించారు. అడపాదడపా మంచి బంతులేసినా పిచ్‌కు తగ్గట్లు పదును చూపలేకపోయారు. వీరిని మార్క్‌రమ్ అవలీలగా ఎదుర్కొన్నాడు. షమీ అయితే ఓవర్‌కు సగటున 4 పరుగులు ఇచ్చాడు. దీంతో అశ్విన్‌ను ముందే దింపాల్సి వచ్చింది. షమీ ఆట మధ్యలో తలనొప్పి కారణంగా మైదానం వీడాడు. మరోవైపు ఇషాంత్ (1/32) పరుగుల కట్టడితో పాటు ప్రమాదకరంగా కనిపించాడు. డివిలియర్స్‌ను అవుట్ చేశాడు.
లేదు... కాదంటూనే మూడు మార్పులు
తుది జట్టు ఆటగాళ్ల కూర్పుపై శుక్రవారం తీవ్రంగా స్పందించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అసలు టెస్టు సమయానికి వచ్చేసరికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా మూడు మార్పులతో బరిలో దిగాడు. పరిస్థితులరీత్యా తప్పక ఉంటారని భావించినప్పటికీ ఓపెనర్ శిఖర్ ధావన్, కీపర్ సాహా, పేసర్ భువనేశ్వర్‌లను పక్కన పెట్టాడు. కేఎల్ రాహుల్, పార్థివ్ పటేల్, ఇషాంత్ శర్మలకు చోటిచ్చాడు. అన్నిటికి మించి తొలి టెస్టులో బౌలర్‌గా సత్తాచాటి, బ్యాటింగ్‌లో అధిక బంతులు ఆడిన భువీని.... బౌన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇషాంత్‌ను తీసుకోవడం కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. ఎన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చినా రహానేకు అవకాశం ఇవ్వకుండా రోహిత్ శర్మపైనే నమ్మకముంచాడు.