మార్క్‌రమ్
జొహన్నెస్‌బర్గ్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు దూరమై బలహీనంగా కనిపిస్తున్న ఆసీస్‌పై దక్షిణాఫ్రికా తొలిరోజు ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్ మార్క్‌రమ్ (152; 17 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకానికి తోడు డివిలియర్స్ (69; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.
నిషేధానికి గురైన ముగ్గురి స్థానంలో బర్న్స్, రెన్‌షా, హ్యాండ్స్‌కోంబ్ బరిలో దిగారు. మార్క్‌రమ్, ఎల్గర్ (19)తో తొలి వికెట్‌కు 53, రెండో వికెట్‌కు ఆమ్లా(27)తో 89 పరుగులు జతచేశాడు. ఆ తర్వాత డివిలియర్స్‌తో మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ఒక దశలో 247/2తో పటిష్టంగా కనిపించిన సఫారీలు 52 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం బవుమా (25 బ్యాటింగ్), డికాక్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
కొత్త ఆరంభం..
వివాదం అనంతరం జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ టిమ్ పైన్ కొత్త తరహా ఒరవడితో నాయకత్వాన్ని ఆరంభించాడు. మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల జాతీయ గీతాలాపన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లందరితో ఆసీస్ క్రికెటర్లు వరుసగా కరచాలనం చేశారు. సాధారణంగా మ్యాచ్ ముగిశాక కనిపించే ఇలాంటి దృశ్యం మ్యాచ్‌కు ముందు కనిపించడం ఇదే తొలిసారి. టిమ్ పైన్ తన ఆలోచనను డు ప్లెసిస్‌తో పంచుకొని ఈ ఏర్పాటు చేశాడు. ఇది ప్రతీ సారి కొనసాగుతుందని చెప్పలేకపోయినా... తాను కొత్తగా మొదలు పెట్టాలనుకున్నట్లు పైన్ వెల్లడించాడు.పరోక్షంగా ‘మరక’ తర్వాత మళ్లీ కొత్త ఆరంభం చేస్తున్నట్లు అతను చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment