జొహాన్నెస్‌బర్గ్: క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) వార్షిక అవార్డుల్లో సఫారీ జట్టు వన్డే, టి20 జట్టు కెప్టెన్ క్వింటన్ డికాక్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాడు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో పురుషుల విభాగంలో డికాక్, మహిళల కేటగిరీలో లారా వోల్వార్ట్ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్నారు. తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో డికాక్ ఇప్పటివరకు 47 టెస్టుల్లో, 121 వన్డేల్లో, 44 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు డికాక్ కెప్టెన్సీలో ఎనిమిది వన్డేలు ఆడిన దక్షిణాఫ్రికా నాలుగింటిలో గెలిచి, మూడింటిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
టి20ల్లో డికాక్ నేతృత్వంలో దక్షిణాఫ్రికా ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలో గెలిచి, ఐదింటిలో ఓటమి చవిచూసింది. ఈ అవార్డును రెండోసారి గెలుచుకున్న డికాక్ (2017)... జాక్వెస్ కలిస్ (2004, 2011), మఖాయ ఎన్తిని (2005, 2006), హషీమ్ ఆమ్లా (2010, 2013), ఏబీ డివిలియర్స్ (2014, 2015), కగిసో రబడ (2016, 2018)ల సరసన చేరాడు. దీంతోపాటు 27 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ డికాక్ ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్నీ సొంతం చేసుకున్నాడు. పేసర్ లుంగీ ఇన్‌గిడి ‘వన్డే, టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెలుచుకోగా... డేవిడ్ మిల్లర్ ‘ఫేవరెట్ ప్లేయర్’గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment