
మ్యాచ్ ను 'టర్న్' చేసి ఆశలు రేకెత్తించారు!
ఇండోర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. 247 పరుగుల స్కోరును కాపాడుకునే క్రమంలో టీమిండియా ఒక్కసారిగా ఆశలు రేకెత్తించింది. ఎనిమిది పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు విజయంపై ఆశలు పెంచారు. 134 పరుగుల స్కోరు వద్ద మూడో వికెట్ ను కోల్పోయిన దక్షిణాఫ్రికా.. ఆ తరువాత స్వల్ప పరుగుల వ్యవధిలో మరో రెండు వికెట్లను చేజార్చుకుంది. అక్షర్ పటేల్ బౌలింగ్ లో జేపీ డుమినీ(36) అవుటైన కాసేపటికే డు ప్లెసిస్(51) కూడా అతని బౌలింగ్ లోనే పెవిలియన్ చేరాడు.
అనంతరం డేవిడ్ మిల్లర్(0)ను భువనేశ్వర్ కుమార్ చక్కటి బంతితోబోల్తా కొట్టించాడు. క్రీజ్ లో డివిలియర్స్(3), బెహర్దియన్(0)లు ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్ లకు తలో వికెట్ లభించింది. దక్షిణాఫ్రికా 27 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.