విజయంపై విరాట్ సేన ఆశలు!
ఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా విజయంపై ఆశలు రేకెత్తిస్తోంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో భాగంగా లంచ్ కు ముందు ఒక వికెట్ మాత్రమే తీసిన టీమిండియా.. ఆ తరువాత వరుసగా రెండు వికెట్లను సాధించింది. తొలుత డుప్లెసిస్(10)ను నాల్గో వికెట్ గా పెవిలియన్ కు పంపగా.. స్వల్ప వ్యవధిలోనే జేపీ డుమినీ(0) వికెట్ ను తీశారు. అంతకుముందు హషీమ్ ఆమ్లా(25) మూడో వికెట్ గా అవుటయ్యాడు. దీంతో సఫారీలు 125.0 ఓవర్లలో ఐదు కీలక వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ కు మూడు, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కాయి.
దక్షిణాఫ్రికా పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.. మధ్యమధ్యలో వికెట్లను చేజార్చుకోవడం ఆ జట్టును కలవర పెడుతోంది. డివిలియర్స్ (36 బ్యాటింగ్ 265 బంతులు, 5 ఫోర్లు), విలాస్(4 బ్యాటింగ్) దక్షిణాఫ్రికాను ఓటమి నుంచి గట్టెక్కించేందుకు యత్నిస్తున్నారు. ఇంకా టీమిండియా విజయానికి ఐదు వికెట్లు అవసరం కాగా, దక్షిణాఫ్రికా గెలుపుకు 369 పరుగులు అవసరం. 72/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా ఓటమి నుంచి తప్పించుకుని మ్యాచ్ ను డ్రాగా ముగించాలని భావిస్తోంది.