టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో 481 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే వికెట్ ను కోల్పోయింది.
ఢిల్లీ:టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో 481 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే వికెట్ ను కోల్పోయింది. డీన్ ఎల్గర్(4) తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. రవి చంద్రన్ అశ్విన్ బౌలింగ్ రహానే క్యాచ్ పట్టడంతో ఎల్గర్ నిష్ర్రమించాడు. దీంతో నాల్గో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోయి ఐదు పరుగులు చేసింది.
190/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 100.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. ఈ రోజు ఆటలో విరాట్ కోహ్లి(88) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినా.. అజింక్యా రహానే మరో శతకాన్ని సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి సఫారీలకు చుక్కులు చూపించిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే తరహాలో బ్యాటింగ్ చేసి మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహానే సెంచరీ చేసిన పిదప టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.