డుప్లెసిన్ భీకర ఇన్నింగ్స్.. లంకకు భారీ లక్ష్యం
కెప్ టౌన్: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా జోరు కోనసాగుతోంది. ఇదివరకే సిరీస్‌ను శ్రీలంకపై 3-0తో నెగ్గిన సఫారీ జట్టు నాలుగో వన్డేలో డుప్లేసిస్ భారీ శతకంతో చెలరేగండతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. చివరి ఓవర్లో డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ భావించినా 185(141 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగుల వద్ద ఔటయి ఐదో వికెట్ రూపంలో నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు డుప్లెసిస్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు రెండో ఓవర్లోనే ఆమ్లా(1)ను లంక బౌలర్ కుమార్ ఔట్ చేశాడు. డికాక్ హాఫ్ సెంచరీ(55, 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు )తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు.
కెప్టెన్ డివిలియర్స్ హాఫ్ సెంచరీ(64, 62 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. డుప్లెసిస్ తన కెరీర్లో ఎనిమిదో వన్డే సెంచరీ చేయడంతో పాటు తన వ్యక్తిగత అత్యధిక స్కోరు(133 నాటౌట్)ను సవరించాడు. అయితే సఫారీ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు గ్యారీ కిర్‌స్టెన్ (188 నాటౌట్) రికార్డుకు మూడు పరుగుల దూరంలోనే ఆగిపోయాడు. చివర్లో డుప్లెసిస్ డబుల్ సెంచరీకి చేరువయ్యాక మెరుపు ఇన్నింగ్స్ ఆడిన బెహర్డిన్(36, 20 బంతుల్లో ) స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకున్నాడు. దీంతో డుప్లెసిస్ కు చివరి ఓవర్లో రెండో బంతికి బ్యాటింగ్ వచ్చింది. మధుశంక బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి గునరత్నే చేతికి చిక్కి, నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసిన సఫారీలు లంక ముందు కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని నిలిపారు.