చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్ డీ కాక్ (4)పరుగులకే పెవిలియన్ చేరి సఫారీలు షాకిచ్చాడు. తర్వాత డుప్లిసెస్ కూడా (13) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టడంతో స్కోరును చక్కదిద్దే బాధ్యతను ఆమ్లా తన భుజాలపై వేసుకున్నాడు. ఓ ప్రక్క ఆమ్లా క్రీజ్ లో నిలకడగా ఆడుతుండగా సఫారీలు డివిలియర్స్(5) రూపంలో మరో వికెట్టును చేజార్చుకుంది.
ఆమ్లా (41) పరుగులు చేసి పెవిలియన్ చేరాకే దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు నత్తనడకన సాగింది. అప్పటికే క్రీజ్ లో ఉన్న డుమినీ (86) పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో అండర్ సన్, సౌతీలకు తలో రెండు వికెట్లు లభించగా, మిల్స్ , మెక్ కల్లమ్ లకు చెరో వికెట్టు దక్కింది.