
విజయానందంలో సఫారీ జట్టు
జొహన్నెస్‌బర్గ్ : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ముగిసింది. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3-1తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. చివరిదైన నాలుగో టెస్టులో ప్రొటీస్ జట్టు ఘన విజయం సాధించింది. అసాధ్యమైన 612 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను ఫిలాండర్ (6 వికెట్లు) దెబ్బ తీయడంతో 119 పరుగులకే కుప్ప కూలింది. దీంతో సఫారీ జట్టు 492 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.
ఇది దక్షిణాఫ్రికా టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయం కాగా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో తలపడిన 7 సిరీస్‌లనంతరం సిరీస్ కైవసం చేసుకొవడం మరో విశేషం. అద్భుతంగా రాణించిన ఫిలాండర్ టెస్టుల్లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన ఫిలాండర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ వరించగా.. సిరీస్ ఆసాంతం ఆసీస్‌ను దెబ్బతీసిన కగిసో రబడ (23 వికెట్లు)కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించింది.
ఈ సిరీస్ ఆరంభం నుంచే వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో వార్నర్-డికాక్‌ల వాగ్వాదం, రెండో టెస్టులో రబడా-స్మిత్‌ల గొడవలతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్‌లపై నిషేదం పడేలా చేసిన ఈ సిరీస్ చివరకు ఆతిథ్య జట్టు వశమైంది.
దక్షిణాఫ్రికా స్కోరు 488 ఆలౌట్ & 344/6 డిక్లెర్
ఆస్ట్రేలియా స్కోరు 221 ఆలౌట్ & 119 ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment