చిట్టగాంగ్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 3 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ ఆశలను మెరుగుపరుచుకుంది. దక్షిణాఫ్రికా విసిరిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదిండానికి బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు శుభారంభం లభించినప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్లు లంబ్ (18), హేల్స్ (38) పరుగులు చేసి ఫర్వాలేదనిపించినా, ఆలీ(10), మోర్గాన్(14)లు స్వల్ప స్కోరుకే పరిమితమై ఇంగ్లండ్ ను కష్టాలోకి నెట్టారు. అనంతరం బట్లర్ (34) పరుగులు చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చాడు.
బొపరా, జోర్డాన్ లు క్రీజ్ లో ఉన్న దశలో విజయం ఇంగ్లండ్ తో దోబూచులాడింది. జోర్డాన్(16), బొపరా ( 31) పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో మ్యాచ్ సఫారీలవైపు మొగ్గింది. కాగా చివర్లో బ్రెస్నాన్(17; రెండు సిక్స్ లు, ఒక ఫోర్) తో మెరిపించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 193 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమి పాలైంది.దక్షిణాఫ్రికా బౌలర్లలో పార్నెల్ కు మూడు వికెట్లు లభించగా, ఇమ్రాన్ తహీర్ కు రెండు, స్టెయిన్, హ్యండ్రిక్స్ లకు తలో వికెట్టు లభించాయి.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సఫారీలు బ్యాటింగ్ చేపట్టారు. ఈనాటి మ్యాచ్ ఇరు జట్లుకు కీలకం కావడంతో సఫారీలు ఆది నుంచి చెలరేగిపోయారు. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(56),డి కాక్ (29)పరుగులు చేసి జట్టుకు చక్కటి పునాది వేశారు.అనంతరం డివిలియర్స్ ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 28 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్ 9 ఫోర్లు,3 సిక్స్ లతో 69 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రెస్నాన్, జోర్డాన్, ట్రేడ్ వెల్, బ్రాడ్ లకు తలో వికెట్టు లభించింది.