ధైర్యే సాహసే విజయం
ఫలించిన ఆమ్లా నిర్ణయం
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 153 పరుగులతో గెలుపు
స్టెయిన్, మోర్కెల్ విజృంభణ
శ్రీలంక 216 ఆలౌట్
గాలే: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే హషీమ్ ఆమ్లా ధైర్యంతో తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఫలితాన్ని ఇచ్చింది. 14 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై తొలి విజయాన్ని అందించింది. తమ సారథి దూకుడు ప్రణాళికలను సరిగ్గా అర ్థం చేసుకున్న పేసర్లు డేల్ స్టెయిన్ (4/45), మోర్నీ మోర్కెల్ (4/29) విరుచుకుపడి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను వణికించడంతో తొలి టెస్టులో సఫారీ జట్టు 153 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్లతో అదరగొట్టిన స్టెయిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
-నాలుగు సెషన్ల ఆట ఉండగానే... శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌ను (206/6) డిక్లేర్ చేసి ప్రత్యర్థి ముందు ఆమ్లా 370 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. అయితే 110/1 ఓవర్‌నైట్ స్కోరుతో మంచి స్థితిలో ఉన్న లంక చివరి రోజు ఆదివారం పేలవ ఆటతో 71.3 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుమార సంగక్కర (145 బంతుల్లో 76; 9 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే రాణించాడు.
-తొలి సెషన్ నాలుగో ఓవర్‌లోనే స్టెయిన్.. కౌశల్ సిల్వా (98 బంతుల్లో 38; 5 ఫోర్లు) వికెట్‌ను తీసి లంక పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఓవర్‌లో సంగక్కర 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను డి కాక్ విఫలం చేశాడు. జయవర్ధనే (10) మరోసారి నిరాశ పరచగా దూకుడు మీదున్న సంగక్కర వికెట్‌ను డుమిని తీసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఆ తర్వాత స్టెయిన్, మోర్కెల్ మూకుమ్మడి దాడి నేపథ్యంలో వరుసగా వికెట్లు కోల్పోయిన లంక గెలుపుపై ఆశలు వదులుకుంది. ఓ దశలో 23 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కోలుకోలేకపోయింది. ఈనెల 24న మొదలయ్యే రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా గెలిస్తే... ఆస్ట్రేలియా నుంచి తిరిగి నంబర్‌వన్ ర్యాంకు చేజిక్కించుకునే అవకాశముంది.