దక్షిణాఫ్రికాదే వన్డే సిరీస్
కేప్టౌన్:ఇంగ్లండ్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. దీనిలో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన చివరి వన్డేలో సఫారీలు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-2 తేడాతో చేజిక్కించుకుంది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్(101;97 బంతుల్లో 11 ఫోర్లు,1 సిక్స్) అజేయ శతకంతో రాణించి విజయంలో సహకరించాడు.
ఇంగ్లండ్ విసిరిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డీకాక్(4), డుప్లెసిస్(0), రాసోవ్(4)లు వరుసగా పెవిలియన్ కు చేరడంతో సఫారీలు 22 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయారు. అయితే ఆ తరుణంలో క్రీజ్ లో ఉన్న హషీమ్ ఆమ్లాకు ఏబీ డివిలియర్స్ జతకలవడంతో స్కోరు బోర్డు ముందుకు కదిలింది. ఈ జోడీ 125 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును పటిష్టస్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే ఆమ్లా(59) హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం డివిలియర్స్ కు వైజ్(41నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో దక్షిణాఫ్రికా 44. 0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.0 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటయ్యింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో హేల్స్(112) శతకం సాధించాడు.