
గుండె పగిలింది!
దేవుడా.... మాకే ఎందుకీ ‘కన్నీటి’ ఘోష! ఎందుకు ఇలా ప్రతీసారి మాతోనే ఆడుకుంటావు. ఒక్కసారి మా మోర్కెల్‌ను చూడు, పసివాడిలా ఆ ఏడుపు...డివిలియర్స్, స్టెయిన్, డు ప్లెసిస్ అందరిదీ అదే బాధ. మైదానంలో ఉన్న చోటినుంచి కదల్లేని స్థితిలో అంతా స్థానువులైపోతే...45 వేల మంది ప్రేక్షకులు జాలితో మా వైపు చూస్తుంటే... ఉబికి వస్తున్న కన్నీళ్లను ఎలా ఆపుకోవాలో తెలీక, సాంత్వన కోసం సహచరుల భుజాలపై వాలి ఏడుస్తున్న మావాళ్లను చూస్తే గుండె తరుక్కుపోతోంది. దక్షిణాఫ్రికా జాతి యావత్తూ అదే పరిస్థితిలో ఉంది. అయినా చెప్పుకుంటే తీరే బాధ కాదు ఇది. ఎందుకంటే అదృష్ట, దురదృష్టాలే కాదు, పరాజయంలో మా తప్పులూ ఉన్నాయని సర్ది చెప్పుకోవడం తప్ప.
ఎందుకో ప్రపంచకప్‌లో గెలుపు చేరువగా అనిపించినప్పుడల్లా... మానుంచి అంతే దూరంగా వెళ్లిపోతోంది. అందినట్లే అంది చేజారిపోతోంది. వర్షం అంటే అందరికీ అదో ఆహ్లదం...అదేంటో మాకు మాత్రం అదే వాన ప్రతిసారీ వేదననే పంచుతోంది. అనుకోని అతిథిగా అవసరం ఉన్నా లేకపోయినా మ్యాచ్ మధ్యలో రావడం, ఎక్కడో మా ఆశలు కరిగించడం అలవాటుగా మారింది. వాన మమ్మల్ని ఆపే సమయానికి ఎంత బాగా ఆడుతున్నాం. డివిలియర్స్, డు ప్లెసిస్ చెలరేగిపోతున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఆఖరి పది ఓవర్లలో మా అంత బాగా ఆడిన మొనగాడే లేడు అంటూ ఇక చివర్లో మెరుపులకు అంతా సిద్ధమైపోయాం. కనీసం 350 చేస్తారేమో అనిపించింది. మిల్లర్ బాగానే ఆడినా... ఆటను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. దాంతో మా లెక్కలు, అంచనాలు అన్నీ తప్పాయి.
అయినా సరే గెలుస్తామనే నమ్మకముంది... కానీ మేం నమ్మిన మా స్టార్ స్టెయిన్ ఆదుకోలేకపోయాడు. ఆక్లాండ్ అభిమానులంతా అటు వైపు అండగా నిలిచిన క్షణాన ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయాం. ఐదో బౌలర్ కోటా కోసం మా కెప్టెన్ స్వయంగా బౌలింగ్ చేయాల్సి వచ్చినపుడు కాస్త ప్రమాద ఘంటిక మోగినట్లనిపించింది. ఈ సమయంలో కాస్త ఆందోళన కలిగినా, తర్వాత అదుపులోకి రావడంతో నిబ్బరంగానే ఉన్నాం.
కానీ మావాళ్లంతా ప్రపంచకప్ ఒత్తిడికి చిత్తయ్యారు. ఫీల్డింగ్ అంటే ఏమిటో, ఎలా ఉండాలో ప్రపంచానికి నేర్పిన మేము, ఆ ఫీల్డింగ్‌తోనే కుప్పకూలటం విషాదం కాదా! ఏబీ వికెట్ల మీదికి పడ్డా రనౌట్ సాధ్యం కాలేదు, డి కాక్ అయితే వికెట్ కీపింగ్ ఓనమాలే మరచినట్లుగా, సునాయాస బంతిని అందుకోలేకపోయాడు. అయినా బెహర్దీన్ క్యాచ్ అందుకునేటప్పుడు ఆ డుమినిని ఎవరు అడ్డం రమ్మన్నారు? ఒక బౌన్సరో, యార్కరో వేయకుండా ప్రపంచ నంబర్‌వన్ బౌలర్... సిక్స్ కొట్టమంటూ ఆహ్వానించినట్లు ఆ లెంగ్త్ బాల్ విసరడమేమిటి!
క్వార్టర్స్ తర్వాత నాకౌట్ మ్యాచ్ గెలవగలిగామని సంబర పడ్డాం. ‘చోకర్స్’ ముద్ర చెరిగిందని సంతోషించాం. అది ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. ఎన్ని ఆశలు రేపినా విశ్వవేదికపై మా తలరాత మాత్రం మారలేదు. ఇకపై ఎన్ని విజయాలు సాధించినా మరో నాలుగేళ్ల పాటు ఈ గాయం మానదు. ఆటలో ఓటమి సహజమే. కానీ ‘ఇలాంటి పరాజయం మాత్రం ఎవరికీ ఇవ్వొద్దు దేవుడా’.... అని ప్రార్థించడం మినహా ఏం చేయగలం! - ఓ దక్షిణాఫ్రికా అభిమాని