'హిస్టరీ' పరీక్ష | Semi-final: New Zealand v South Africa | Sakshi
Sakshi News home page

'హిస్టరీ' పరీక్ష

Published Tue, Mar 24 2015 1:44 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

'హిస్టరీ' పరీక్ష - Sakshi

'హిస్టరీ' పరీక్ష

నేడు ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్
ప్రపంచకప్‌లో ఆరుసార్లు సెమీస్‌కు చేరినా.... న్యూజిలాండ్‌కు ఇప్పటివరకూ ఫైనల్ అందని ద్రాక్షే. మూడుసార్లు సెమీస్‌కు చేరినా... ప్రతిసారీ తోడుగా దురదృష్టాన్ని తెచ్చుకోవడం దక్షిణాఫ్రికాకు అలవాటు. మరికొద్ది గంటల తర్వాత... ఒకరిది ‘హిస్టరీ’, మరొకరిది ‘ట్రాజెడీ’. ఎవరు గెలిచినా తొలిసారి ప్రపంచకప్‌కు చేరి చరిత్ర సృష్టిస్తారు. ఓడినవాళ్లు మరో నాలుగేళ్లు విషాదంలోనే ఉంటారు. ఈ టోర్నీలో న్యూజిలాండ్ అపజయాల మాటే లేకుండా ఇక్కడి దాకా వచ్చింది. మరోవైపు సఫారీలు తడబడ్డా బలంగా నిలబడ్డారు. బలాబలాలు చూస్తే రెండు జట్లూ సమానం... ఇద్దరిదీ ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అనే దృక్పథం... రెండు శిబిరాల్లోనూ గెలుపుపై నమ్మకం... అందుకే నేడు జరిగే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ ఆసక్తికరం. సగటు క్రికెట్ అభిమానికి కావలసినంత వినోదం..!
 
సెమీస్ ‘సీన్’...
ప్రపంచకప్ ఆరంభానికి ముందు ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని అడిగితే, నిస్సందేహంగా దక్షిణాఫ్రికాకే చాలా మంది ఓటు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. న్యూజిలాండ్ గెలుపుపై ప్రస్తుతం చాలా అంచనాలే ఉన్నాయి. విజయం ఎవరిని వరించినా...సెమీస్ స్థాయిలో ఆశించే హోరాహోరీ పోరు మాత్రం తప్పదు. ఇప్పటి వరకు కివీస్ జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు ఫలితాన్ని శాసించాడు. ఫలితమే వరుసగా ఏడు విజయాలు. మరో వైపు లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఓడినా... దక్షిణాఫ్రికా క్వార్టర్స్‌లో చెలరేగి నాకౌట్ గండాన్ని దాటింది. ఆ మ్యాచ్ వారిలో కొత్త ఉత్సాహం తెచ్చింది.
 
సన్నాహకాలు
తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడిన దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్‌కు ముందు చాలా విరామం లభించింది. శ్రీలంకతో క్వార్టర్స్‌కు ముందులాగే సెమీస్‌కు ముందు కూడా సోమవారం దక్షిణాఫ్రికా ప్రాక్టీస్ చేయలేదు. మరో వైపు న్యూజిలాండ్ శనివారమే మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత సాధన కూడా చేసింది. సొంతగడ్డపై ఆ జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి.  తాము ఆతిథ్యం ఇస్తున్న ఆఖరి మ్యాచ్‌ను గెలుపుతో ముగించాలని కివీస్ భావిస్తోంది.
 
పిచ్, వాతావరణం
ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ చిన్న మైదానమే అయినా...పేస్, బౌన్స్ కారణంగా ఈ పిచ్‌పై భారీ స్కోర్లు చేయడం అంత సులువు కాదు. ఇరు జట్లలోనూ నాణ్యమైన పేసర్లు ఉన్నారు. ప్రపంచకప్‌లోని గత మూడు మ్యాచ్‌లలో రెండింటిలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. వాతావరణం బాగుంది. మ్యాచ్ రోజు చిరుజల్లులకు అవకాశం ఉన్నా... ఆటకు ఇబ్బంది ఉండకపోవచ్చు.
 
వీరు ఎలా ఆడతారో...
కివీస్ కొత్త హీరో గప్టిల్‌పై ఇప్పుడు అందరి దృష్టీ నిలిచింది. తాజా డబుల్ సెంచరీతో అతనినుంచి అద్భుతాలు ఆశిస్తున్నారు. అయితే దక్షిణాఫ్రికాపై గప్టిల్ 11 మ్యాచ్‌లలో రెండు డకౌట్లు సహా 11.50 సగటుతో చేసినవి 115 పరుగులే! ఐదో బౌలర్ లేని లోటు దక్షిణాఫ్రికాను లీగ్ దశలో ఇబ్బంది పెట్టింది. అయితే క్వార్టర్స్‌లో చెలరేగిన డుమిని కొత్త ఆశలు రేపాడు. అతని ఆఫ్ స్పిన్ కివీస్‌పై ఏ మాత్రం పని చేస్తుందో చూడాలి.
 
మార్పులు చేర్పులు
మిల్నే గాయంతో తప్పుకోవడంతో కివీస్ అతని స్థానంలో హెన్రీని తీసుకుంది. అయితే తుది జట్టులో అతనికి చోటిస్తారా లేదా వెటరన్ మిల్స్‌ను తీసుకుంటారా చూడాలి.
 న్యూజిలాండ్ (అంచనా): మెకల్లమ్ (కెప్టెన్), గప్టిల్, విలియమ్సన్, టేలర్, ఇలియట్, అండర్సన్, రోంచి, వెటోరి, సౌతీ, బౌల్డ్, హెన్రీ/మిల్స్
 దక్షిణాఫ్రికా ఫిలాండర్‌ను తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. అబాట్ నిలకడగా రాణిస్తున్నా, ఫిలాండర్ బ్యాటింగ్ జట్టుకు ఉపయోగపడవచ్చు.
 దక్షిణాఫ్రికా (అంచనా): డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, డి కాక్, డు ప్లెసిస్, రోసో, మిల్లర్, డుమిని, స్టెయిన్, మోర్కెల్, తాహిర్, అబాట్/ఫిలాండర్.
 
స్టాట్స్
ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో కివీస్ వరుసగా గత మూడు ప్రపంచకప్ మ్యాచ్‌లతో సహా నాలుగు నెగ్గింది.
న్యూజిలాండ్ గడ్డపై కివీస్‌తో ఆడిన మ్యాచ్‌లలో 9-9తో రికార్డు సమంగా ఉంది. అయితే గత 5 వన్డేలలో మాత్రం దక్షిణాఫ్రికానే గెలిచింది.
ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ ఆరు సార్లు (1975, 1979, 1992, 1999, 2007, 2011), దక్షిణాఫ్రికా మూడు సార్లు (1992, 1999, 2007) సెమీ ఫైనల్‌కు చేరాయి.
 
కామెంట్స్
‘మ్యాచ్ ఏదైనా జట్టులో కొంత మంది ఎక్కువ ఒత్తిడి ఎదుర్కోవడం సహజం. దక్షిణాఫ్రికాతో సెమీస్ కోసం మేమంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం.  గత రికార్డులు మేం ఫైనల్ చేరేందుకు పనికి రావు. ఫైనల్ చేరేందుకు వంద శాతం శ్రమిస్తాం’                         -మెకల్లమ్
 
‘మా ప్రత్యర్థి చాలా బాగా ఆడుతోందని తెలుసు. అయితే జరిగిన ఆట గురించి ఆలోచించడం అనవసరం. మా స్థాయికి తగినట్లుగా ఆడితే కచ్చితంగా గెలుస్తాం.  మమ్మల్ని ఎవరూ ఆపలేరు. జట్టు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. మా గత ప్రదర్శనపై కూడా చాలా చర్చ జరుగుతోంది. కానీ మేం పట్టించుకోము.’          -డివిలియర్స్
 
ప్రపంచకప్‌కు ముందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మెకల్లమ్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు 134 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది.
 
సెమీస్‌కు చేరారిలా...
 న్యూజిలాండ్
 శ్రీలంకపై 98 పరుగుల విజయం
 స్కాట్లాండ్‌పై 3 వికెట్లతో గెలుపు
 ఇంగ్లండ్‌పై 8 వికెట్ల విజయం
 ఆస్ట్రేలియాపై 1 వికెట్‌తో గెలుపు
 అఫ్ఘానిస్తాన్‌పై ఆరు వికెట్ల విజయం
 బంగ్లాదేశ్‌పై 3 వికెట్ల విజయం
 వెస్టిండీస్‌పై 143 పరుగుల విజయం (క్వార్టర్స్)
 
 దక్షిణాఫ్రికా
 జింబాబ్వేపై 62 పరుగుల విజయం
 భారత్ చేతిలో 130 పరుగులతో ఓటమి
 వెస్టిండీస్‌పై 257 పరుగుల విజయం
 ఐర్లాండ్‌పై 201 పరుగుల విజయం
 పాకిస్తాన్ చేతిలో 29 పరుగులతో ఓటమి
 యూఏఈపై 146 పరుగుల విజయం
 శ్రీలంకపై 9 వికెట్లతో విజయం (క్వార్టర్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement