తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ టైటిల్ సొంతం
వరుసగా రెండోసారి ఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా జట్టు
ఒక జట్టు తలరాత మారలేదు. పురుషులు, మహిళల జట్టేదైనా కావొచ్చు కానీ... దక్షిణాఫ్రికా ఐసీసీ ప్రపంచకప్ భాగ్యానికి మాత్రం నోచుకోలేదు. మరో‘సారీ’ చోకర్స్‌గానే మిగిలారు. మరో జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేళ్లయినా న్యూజిలాండ్ పురుషుల జట్టు సాధించలేకపోయిన వరల్డ్‌కప్ (వన్డే, టి20) టైటిల్స్‌ను న్యూజిలాండ్ మహిళల జట్టు (2000లో వన్డే) సాధించి ఔరా అనిపించింది.
దుబాయ్: దక్షిణాఫ్రికాను చూస్తే ఎవరైనా అయ్యో పాపం అనక మానరు! సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియా చేతిలో పురుషుల జట్టు, ఇప్పుడేమో న్యూజిలాండ్ చేతిలో మహిళల దక్షిణాఫ్రికా టీమ్ ఫైనల్లో పరాజయంతో ప్రపంచకప్ కలను కలగానే మిగిల్చుకున్నాయి. సఫారీకిది తీరని వ్యథే! మరీ ముఖ్యంగా అమ్మాయిలకైతే గతేడాది సొంతగడ్డపై, ఇప్పుడు దుబాయ్‌లో వరుసగా రన్నరప్ ట్రోఫీనే దిక్కయింది.
మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో న్యూజిలాండ్ కొత్త విశ్వవిజేతగా అవతరించింది. అమీతుమీలో కివీస్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. మూడో ప్రయత్నంలో టి20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది. 2009, 2010లలో న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. విజేత న్యూజిలాండ్ జట్టుకు 23 లక్షల 40 వేల (రూ. 19 కోట్ల 67 లక్షలు) డాలర్లు, రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టుకు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 83 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (43; 4 ఫోర్లు), ఓపెనర్ సుజీ బేట్స్ (32; 3 ఫోర్లు), మిడిలార్డర్‌లో బ్రూక్ హ్యాలిడే (28 బంతుల్లో 38; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎమ్‌లాబా 2 వికెట్లు తీయగా, అయబొంగ, ట్రియాన్, డి క్లెర్క్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేసి ఓడిపోయింది. ఓపెనర్లు కెపె్టన్ లౌరా వోల్‌వార్ట్ (33; 5 ఫోర్లు), తజ్మిన్ బ్రిట్స్ (17; 1 ఫోర్) 6.5 ఓవర్లలో 51 పరుగులు చేసి శుభారంభమిచ్చారు. ఇక మిగిలిన 13.1 ఓవర్లలో 108 పరుగులు చేస్తే కప్ గెలిచేసేది.
కానీ అదే స్కోరుపై బ్రిట్స్, కాసేపటికి లౌరా అవుట్ కావడంతోనే అంతా మారిపోయింది. తర్వాత వచ్చిన అనెకె (9), మరిజాన్ (8), డి క్లెర్క్ (6), ట్రియాన్ (14), సునె లుస్ (8), డెర్క్‌సెన్ (10) కివీ బౌలర్ల ధాటికి బెంబేలెత్తారు. రోజ్‌మేరీ, అమెలియా కెర్ చెరో 3 వికెట్లు తీశారు. కెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment