కొలంబో: న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరఫున 250 వికెట్ల మార్కును చేరిన నాల్గో బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సౌతీ ఈ మార్కును చేరాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేను ఔట్ చేయడం ద్వారా 250 వికెట్ల క్లబ్‌లో సౌతీ చేరిపోయాడు. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు 245 టెస్టు వికెట్లతో ఉన్న సౌతీ.. లంకేయులపై తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించాడు.
అయితే రెండో ఇన్నింగ్స్‌లో సైతం సౌతీ రెండు వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. కాగా, తనతో కలిసి కొత్త బంతిని పంచుకునే మరో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 250 వికెట్ల మార్కును చేరిన మూడు రోజుల్లోనే అతని సరసన సౌతీ నిలవడం ఇక్కడ విశేషం, అయితే న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో రిచర్డ్ హ్యాడ్లీ(431) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో డానియెల్ వెటోరి(361) ఉన్నాడు. ఆపై వరుస స్థానాల్లో బౌల్ట్, సౌతీలే ఉండటం మరో విశేషం. లంకేయులతో రెండో టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తన తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 431/6 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 122 పరుగులకే చాపచుట్టేసింది. లంక రెండో ఇన్నింగ్స్‌లో డిక్వెల్లా(51) మినహా ఎవరూ రాణించలేదు. బౌల్ట్, సౌతీ, అజార్ పటేల్, సోమర్‌విల్లేలు తలో రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దాంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది. తొలి టెస్టులో శ్రీలంక విజయం నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment