మొరాకో పౌరుషం | Spain draws with Morocco, reaches round of 16 at FIFA World Cup 2018 | Sakshi
Sakshi News home page

మొరాకో పౌరుషం

Published Wed, Jun 27 2018 1:30 AM | Last Updated on Wed, Jun 27 2018 1:30 AM

Spain draws with Morocco, reaches round of 16 at FIFA World Cup 2018 - Sakshi

కలినిన్‌గ్రాడ్‌: మొరాకో దెబ్బకు ఉక్కిరిబిక్కిరై, ఓ దశలో వెనుకబడి, ఓటమి దిశగా వెళ్లినప్పటికీ మాజీ చాంపియన్‌ స్పెయిన్‌ నిలదొక్కుకుంది. సోమవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌ను అతి కష్టమ్మీద 2–2తో ‘డ్రా’ చేసుకున్న ఆ జట్టు గ్రూప్‌ ‘బి’ టాపర్‌గా నాకౌట్‌ చేరింది. ఫలితం ఎలా ఉన్నా మ్యాచ్‌ రెండు భాగాల్లోనూ ముందుగా గోల్‌ కొట్టి మొరాకోనే మొనగాడుగా నిలిచింది. పదేపదే దాడులు ఎదుర్కొన్నా, బంతిపై ఆధిక్యం దక్కకున్నా, పాస్‌లు అందుకోవడంలో విఫలమైనా, విపరీతంగా ఫౌల్స్‌ చేసినా, ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు ఎల్లో కార్డ్‌లకు గురైనా... ఆ జట్టు స్పెయిన్‌కు షాకిచ్చేలా కనిపించింది. అయితే, ఇంజ్యూరీ సమయంలో ఇయాగో అస్పాస్‌ (90+1వ ని.లో) గోల్‌ కొట్టి స్పెయిన్‌ను ఒడ్డున పడేశాడు. అంతకుముందు మొరాకో తరఫున ఖలిద్‌ బౌతైబ్‌ (14వ నిమిషం), ఎన్‌ నెసిరి (81వ ని.), స్పెయిన్‌ నుంచి ఇస్కో (19వ ని.) గోల్స్‌ చేశారు. 

ఆటలో అంతరం... ఫలితం సమం 
తమ స్థాయికి తగినట్లు మ్యాచ్‌ను స్పెయిన్‌ దూకుడుగా ప్రారంభించింది. మొరాకో ఇబ్బంది పడకుండానే ఆడింది. 14వ నిమిషంలో ప్రత్యర్థి డిఫెన్స్‌లోని ఆండ్రెస్‌ ఇనెస్టాను తప్పిస్తూ బంతిని ముందుకు తీసుకెళ్లిన బౌతైబ్‌... కీపర్‌ డేవిడ్‌ డి గీని బోల్తా కొట్టించి ఎడమకాలితో గోల్‌ పోస్ట్‌లోకి పంపాడు. అయితే, ఐదు నిమిషాల్లోనే స్పెయిన్‌ స్కోరు సమం చేసింది. ఇనెస్టా చురుకైన కదలికలతో అందించిన బంతిని ఇస్కో గోల్‌గా మలిచాడు. రెండు జట్లకు తర్వాత కూడా అవకాశాలు వచ్చినా సద్వినియోగం కాకపోవడంతో మొదటి భాగం 1–1తోనే ముగిసింది. రెండో భాగం ప్రారంభం నుంచే మొరాకో ఆటలో తీవ్రత పెంచింది. వీలైనంతగా ప్రత్యర్థి డిఫెండర్లను ఇబ్బందిపెట్టింది. స్ట్రయికర్ల దూకుడుతో స్పెయిన్‌ కూడా తగ్గలేదు. ఈ క్రమంలో ఇరుజట్లకు వరుసగా హెడర్‌ గోల్‌ అవకాశాలు వచ్చాయి. 70వ నిమిషంలో పికె కొట్టిన ఓ హెడర్‌ గోల్‌పోస్ట్‌కు కొద్ది దూరం నుంచి వెళ్లింది. కొద్దిసేపటికే అప్రయత్నంగా  పికె చేతికి తగిలిన బంతి బయటకు వెళ్లింది. దీంతో మొరాకోకు కార్నర్‌ కిక్‌ లభించింది. దీనిని ఎన్‌     నెసిరి... హెడర్‌ ద్వారా స్కోరు చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. నిర్ణీత సమయం ముగిసే క్రమంలో స్పెయిన్‌ పరాజయం ముంగిట నిలిచింది. కానీ, ఇంజ్యూరీ (90+1)లో డ్రామా నడిచింది. డి బాక్స్‌ లోపల కుడి వైపు నుంచి అందిన పాస్‌ను... అస్పాస్‌ క్షణాల వ్యవధిలో గోల్‌ చేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు. సరిగ్గా మొరాకో గోల్‌పోస్ట్‌ ఎదుట ఉన్న అతడు కీపర్‌ తేరుకునేలోపే బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఇది ఆఫ్‌సైడ్‌ అంటూ అభ్యంతరాలు రావడతో వీఏఆర్‌ సాయం తీసుకున్నారు. అందులో స్పష్టమైన గోల్‌గా తేలింది. మిగతా రెండు నిమిషాల ఇంజ్యూరీ సమయమూ స్కోరేమీ లేకుండానే ముగిసింది. స్పెయిన్‌ డ్రాతో బయటపడింది. మొరాకో ఆటగాళ్లు ఆరుగురు ఎల్లో కార్డుకు గురయ్యారు. 

గ్రూప్‌ ‘బి’లో ఒక గెలుపు, రెండు డ్రాలతో స్పెయిన్, పోర్చుగల్‌ ఐదు పాయింట్లు పొంది పట్టికలో సమంగా నిలిచాయి. అయితే చేసిన గోల్స్‌ ( 6) ఆధారంగా స్పెయిన్‌కు అగ్రస్థానం లభించింది. పోర్చుగల్‌కు (5 గోల్స్‌) రెండో స్థానం దక్కింది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఈనెల 30న ఉరుగ్వేతో పోర్చుగల్‌; జూలై 1న రష్యాతో స్పెయిన్‌ తలపడతాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement