![Special to indian bowling - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/22/BUMRAH-BHUVI.jpg.webp?itok=HmbA1qy2)
బ్యాటింగ్ ఎలా ఉన్నా... బౌలింగ్‌లో చేజేతులా వనరులను దెబ్బతీసుకున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భువీ, బుమ్రా ఎంతటి ప్రభావం చూపారో తెలిసీ వారిని ఇంగ్లండ్ సిరీస్‌కు కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా భువీ సఫారీ గడ్డపై అటు బ్యాట్‌తోనూ ఆదుకున్నాడు. అలాంటివాడి ఫిట్‌నెస్‌పై ఐపీఎల్ సందర్భంగానే హెచ్చరికలు వచ్చాయి. ఎలాగూ పసికూనే అని అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు విశ్రాంతినిచ్చారు. అప్పుడే భవిష్యత్ గురించి ఆలోచించి భువీ పూర్తిగా కోలుకునేలా చూడాల్సింది. అదేమీ లేకుండా, అందరినీ పరీక్షించాలంటూ ఐర్లాండ్‌తో రెండో టి20 ఆడించారు. సరిగ్గా ఇదే మ్యాచ్‌లో బరిలో దిగిన బుమ్రా వేలికి గాయం చేసుకుని ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దూరమయ్యాడు. తర్వాతి మ్యాచ్‌లకూ కష్టమే అన్నట్లుంది.
వాస్తవానికి ఐర్లాండ్ వంటి జట్టుపై వీరిద్దరు ఆడటం అనవసరం. అటు భువీ... ఇంగ్లండ్‌పై మొదటి టి20లో ధారాళంగా పరుగులిచ్చాడు. రెండో టి20లో ప్రారంభంలో కట్టుదిట్టంగా బంతులేసినా గెలిపించాల్సిన స్థితిలో చేతులెత్తేశాడు. మళ్లీ రెండు వన్డేలు విశ్రాంతినిచ్చి పెద్దగా అవసరం లేకున్నా చివరి వన్డే ఆడించారు. అందులో అతడు ఆసాంతం అసౌకర్యంగానే కనిపించాడు. ఇప్పుడు మూడు టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. బౌలింగ్‌లో వీరిద్దరూ టెస్టులకు పూర్తిస్థాయిలో ఉంటే, అటు బ్యాటింగ్ దన్నుతో పెద్దగా ఆందోళన ఉండకపోయేది. కానీ, ఇది తారుమారైంది. అంతా కలిసొచ్చి, తమదైన రోజున మాత్రమే ప్రతాపం చూపగల ఇషాంత్, ఉమేశ్‌లను, వ్యక్తిగత వివాదాలు, ఫామ్‌లేమి, ఫిట్‌నెస్ ఇబ్బందులతో సతమతం అవుతున్న మొహమ్మద్ షమీపై ఆధారపడాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment