సత్తా చాటుతున్న మన బా'క్సింగ్‌'లు | Special Story About Boxers From Nizamabad, Telangana | Sakshi
Sakshi News home page

సత్తా చాటుతున్న మన బా'క్సింగ్‌'లు

Published Sun, Jul 28 2019 12:56 PM | Last Updated on Sun, Jul 28 2019 1:25 PM

Special Story About Boxers From Nizamabad, Telangana - Sakshi

నిఖత్‌ జరీన్, హుసా ముద్దీన్‌

సాక్షి, నిజామాబాద్‌ : పంచ్‌ పడిందంటే పతకం రావాల్సిందే.. రింగ్‌లోకి దిగారంటే ప్రత్యర్థులు మట్టికరవాల్సిందే.. బాక్సింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు. జిల్లాకే కాకుండా రాష్ట్రానికి.. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నారు మన ఇందూరు బిడ్డలు..వారే నిఖత్‌ జరీన్, హుసా ముద్దీన్‌లు. దశాబ్ద కాలంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించారు. శనివారం థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నీలో ఇద్దరూ రజతాలు సాధించి మరోసారి దేశ కీర్తి పతాకను ఎగురవేశారు.

పేదరికాన్ని జయించి..
పట్టుదల.. కృషి.. సాధించాలన్న తపన.. ఉంటే ఎంతటి పేదరికాన్ని అయినా జయించవచ్చు.. నిరంతరం సాధన చేస్తూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాక్సింగ్‌లో దూసుకుపోతోంది నగరంలోని వినా యక్‌నగర్‌కు చెందిన నిఖత్‌ జరీన్‌. ఇప్పటికే 6 బంగారు పతకాలు సాధించింది. అలాగే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో పతకాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో రజత పతకం సాధించింది.

కుటుంబ నేపథ్యం..
పేద కుటుంబంలో పుట్టి నలుగురు అమ్మాయిల్లో ఒకరిగా పెరిగిన నిఖత్‌జరీనా ఈ స్థాయికి రావడం వెనక ఎంతో కృషి ఉంది. నిజామాబాద్‌ నగరంలోని వినాయక్‌నగర్‌ కాలనీకి చెందిన ఎండీ జమీల్‌ అహ్మద్, ఫర్వీన్‌ సుల్తానాలకు నలుగురు కూతుళ్లు, నిఖత్‌ జరీన్‌ 3వ సంతానం. తండ్రి జమీల్‌ బతుకుదెరువు కోసం గతంలో సౌదీ అరేబియాలోని స్పోర్ట్స్‌ దుకాణంలో పనిచేశాడు. ఫుట్‌బాల్‌ క్రీడాకారుడైన జమీల్‌ తిరిగి వచ్చాక తన మూడో కూతురు నిఖత్‌జరీనాకు ఆటలపై ఉన్న ఆసక్తిని గమనించి బాక్సింగ్‌లో ప్రోత్సహించాడు.

కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ అనేక కష్టనష్టాలకు ఓర్చి కూతురుకు బాక్సింగ్‌లో శిక్షణను ఇప్పించాడు. బాక్సింగ్‌ కోచ్‌ శంషోద్దీన్‌ సూచనలతో నిఖత్‌ను బాక్సింగ్‌ రింగ్‌లోకి దింపారు. ప్రతిరోజూ నాలుగు గంటల పాటు కఠోర శిక్షణ అందించారు. గతంలో అమ్మాయిలు బాక్సింగ్‌పై ఆసక్తి చూపకపోవడంతో నిఖత్‌ అబ్బాయిలతో పాటు సాధన సాగించేది. నిఖత్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తర్వాత ప్రస్తుతం ఆమెను ఆదర్శంగా తీసుకొని బాలికలు బాక్సింగ్‌ ఆటపై ఆసక్తికనబరుస్తున్నారు.

విద్యాభ్యాసం..
నిర్మల హృదయ బాలికల పాఠశాలలో చదివిన నిఖత్‌ ఇంటర్‌లో కాకతీయ, డిగ్రీ దోమలగూడ ఏవీ కాలేజ్‌ చదువుకుంది. గవర్నమెంట్‌ గిరిరాజ్‌ కాలేజీలో ఎంఏ సైకాలజీ మొదటి సంవత్సరం చదువుతోంది. బాక్సింగ్‌ మొదలు పెట్టిన మూడు నెలల్లోనే రాష్ట్ర స్థాయి పైకా క్రీడల్లో బంగారు పతకం సాధించింది. తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించిన నిఖత్‌ జిల్లా క్రీడాభిమానులే కాక రాష్ట్ర, జాతీయ స్థాయిలో అభినందనలు అందుకుంటోంది. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తానని నిఖత్‌ జరీన్‌ ధీమాగా చెబుతోంది.

సాధించిన విజయాలు

  • 2012లో జనవరిలో సెర్బియా దేశంలో జరిగిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించింది.
  • 2013 సెప్టెంబరులో జరిగిన యూత్‌ వరల్డ్‌ బాక్సింగ్‌లో వెండి పతకం సాధించింది.
  • 2014 సెర్బియాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ బాక్సింగ్‌ టోర్నీ అండర్‌–19లో గోల్డ్‌మెడల్‌ సాధించింది. జూలైలో జరిగిన సువోటికా ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మరో బంగారు పతకం తన ఖాతాలో వేసుకుంది.
  • 2015 పంజాబ్‌ జలంధర్‌లో జరిగిన ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. దీంతో పాటు బెస్ట్‌ బాక్సర్‌ అవార్డును సొంతం చేసుకుంది.
  • 2015లో గోవాలో జరిగిన ఇండో– శ్రీలంక టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించింది. అసోంలో జరిగిన సీనియర్‌ జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించింది.
  • 2016లో సాప్‌ నిర్వహించిన పోటీల్లో బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. 13 ఏఐబీఏ ఉమెన్స్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
  • 2016లో ఎలైట్‌ సీనియర్స్‌ ఉమెన్స్‌ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకుంది.
  • 2018 జనవరిలో జరిగిన ఎలైట్‌ సీనియర్‌ నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది.
  • జనవరి 2018 ఇండియన్‌ ఓపెన్‌ బాక్సింగ్‌లో పాల్గొంది.
  • 2018లో ఏప్రిల్‌ జరిగిన బెల్‌గ్రేడ్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది.
  • జనవరి 2019లో జరిగిన ఎలైట్‌ సీనియర్స్‌ బాక్సింగ్‌ పోటీల్లో సిల్వర్‌ మెడల్‌ దక్కించుకుంది.
  • ఫిబ్రవరి 2019లో జరిగిన బల్గేరియా అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో 51కేజీల విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకుంది.
  • 2019 ఏప్రిల్‌లో జరిగిన బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ ఏషియన్‌ బాక్సింగ్‌ టోర్నీలో కాంస్య పతకం సాధించింది.
  • 2019 మేలో జరిగిన అసోంలోని గౌహతిలో జరిగిన అంతర్జాతీయ ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నీలో కాంస్య పతకం సాధించింది.
  • ప్రస్తుతం ఈ నెలలో జరుగుతున్న థాయ్‌లాండ్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. బంగారు పతకం సాధించడానికి కృషి చేస్తోంది.

చిన్నప్పటి నుంచే..
నిజామాబాద్‌స్పోర్ట్స్‌: తనే తండ్రి తనకు గురువు.. ఆడుతూ పాడుతూ తిరిగే వయస్సులోనే చేతులకు బాక్సింగ్‌ గ్లౌజులు వేసుకున్నాడు.. చిన్ననాటి నుంచే బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు.. 5వ తరగతి నుంచే ప్రతినిత్యం బాక్సింగ్‌లో మెలకువలు నేర్చుకున్నాడు.. తండ్రి, అన్నయ్యలు సైతం బాక్సింగ్‌లో రాణించడంతో తన మనస్సులో మరింత బలంగా బాక్సింగ్‌లో రాణించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు.. పాఠశాల స్థాయి నుంచే కాంస్య, రజత, బంగారు పతకాలు సాధించాడు నగరానికి చెందిన ఎండీ హుస్సాముద్దీన్‌. ఆర్మీలో చేరి క్రీడల్లో రాణిస్తూ దేశానికి, రాష్ట్రానికి, ఇందూర్‌ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతున్నాడు.

కుటుంబ నేపథ్యం..
బాక్సింగ్‌ కోచ్‌ శంషొద్దీన్, తల్లి షైనాబేగంలకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఇందులో 5వ వాడు  హుస్సాముద్దీన్, తండ్రితో పాటు ముగ్గురు కుమారులు బాక్సింగ్‌లో పతకాలు సాధించారు. హుస్సాముద్దీన్‌ నగరంలోని గోల్డెన్‌జూబ్లీ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో చదివాడు. 5వ తరగతి నుంచే బాక్సింగ్‌లో తండ్రి, అన్నయ్యల వద్ద బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌లో కఠోరంగా శ్రమించడంతో పాఠశాల స్థాయి నుంచే రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధించాడు. 16ఏళ్ల వయస్సులోనే ప్రతిభతో ఆర్మీకి ఎంపికయ్యాడు. అయితే వయస్సు తక్కువగా ఉండడంతో రెండేళ్ల వరకు ఆర్మీ నుంచే చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌లు వచ్చాయి. తదనంతరం ఆర్మీలో చేరారు. అప్పటి నుంచి దేశం తరపున అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్‌ టోర్నీలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు.

రాష్ట్రస్థాయిలో..

  • 2008 సంవత్సరంలో ఎస్‌జీఎఫ్‌ వరంగల్‌లో జరిగిన బాక్సింగ్‌ టోర్నీలో బంగారు పతకం సాధించాడు.
  • 2011యూత్‌ బాక్సింగ్‌యూత్‌ బాక్సింగ్‌చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుపొందాడు.
  • 2012 జూనియర్‌ బాక్సింగ్‌షిప్‌ నల్గొండలో జరుగగా బంగారు పతకం సొంతం చేసుకున్నాడు.
  • 2017 ఎలైట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ హైదరాబాద్‌లో జరుగగా బంగారు పతకం సాధించాడు.

ఇంటర్‌ సర్వీస్‌ లెవల్‌..

  • 2014 ఇంటర్‌ సర్వీసెస్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ షిమ్లాలో జరగగా రజత పతకం సాధించాడు.
  • 2016లో ఇంటర్‌ సర్వీసెస్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పూణెలో బంగారు పతకం, అలాగే బెంగుళూరులో జరిగిన బాక్సింగ్‌ చాంపియన్‌సిప్‌లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు.
  • 2017లో షిమ్లాలో జరిగిన బాక్సింగ్‌చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు.

జాతీయస్థాయిలో..

  •  2007, 2008 సంవత్సరాల్లో జాతీయస్థాయి బాక్సింగ్‌లో పాల్గొన్నాడు.
  • 2009లో జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ మహారాష్ట్రలో జరగగా కాంస్య పతకం సాధించాడు.
  • 2010 పైకా జాతీయస్థాయి టోర్నీ పంజాబ్‌లో జరగగా అందులో రజత పతకం సొంతం చేసుకున్నాడు.
  • 2011లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన యూత్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌లో రజత పతకం సాధించాడు.
  • 2012 యూత్‌ జాతీయస్థాయి చాంపియన్‌షిప్‌ పటియాలలో జరగగా రజత పతకం సాధించాడు.
  • ఎలైట్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌చాంపియన్‌షీప్‌ అస్సాంలోని గౌహతిలో జరగగా బంగారం పతకం గెలుపొందాడు.

అంతర్జాతీయస్థాయిలో..

  • 2011 క్యూబా, 2012 ఫిన్‌లాండ్, 2014 చైనా తదితర దేశాలో జరిగిన అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌లో పాల్గొన్నాడు.
  • 2015లో కొరియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో కాంస్య పతకం సాధించాడు.
  • 2016లో అసోంలోని గౌహతిలో జరిగిన అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌లో బంగారు పతకం గెలిచాడు.
  • 2017లో బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌లో రజత పతకం సాధించాడు.
  • ఇదే ఏడాది మంగోలియాలో జరిగిన అంతర్జాతీయస్థాయి టోర్నీలో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.
  • 2018లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించాడు. ఇదే సంవత్సరం సోఫియా, ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో వరుసగా కాంస్య పతకాలు సాధించాడు.
  • తాజాగా జరిగిన థాయ్‌లాండ్‌ బాక్సింగ్‌ టోర్నీలో రజత పతకం సొంత చేసుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement