ఇద్దరూ ఇద్దరే...
సాక్షి క్రీడావిభాగం
‘మేమిద్దరం గతంలో కలిసి ఆడిన సందర్భాల్లో ఎలాంటి భయం లేకుండా నిర్దాక్షిణ్యంగా బ్యాటింగ్ చేసేవాళ్లం. అదే తరహాలో ఆటతీరును మళ్లీ చూపిస్తాం’... ధోనితో తన భాగస్వామ్యం గురించి వన్డే సిరీస్‌కు ముందు యువరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. మాట వరసకు అతి విశ్వాసం తో ఈ మాట అన్నాడో, రాబోయే తుఫాన్ ను ముందుగా ఊహించాడో కానీ కటక్‌లో మాత్రం వీరిద్దరు కలిసి ప్రత్యర్థికి నిజంగానే దడ పుట్టించారు. ఇన్నింగ్స్‌లో వీరిద్దరు ఆడిన ఒక్కో బంతి పాత జ్ఞాపకాలను తట్టిలేపింది. మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చి తన ఎంపికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒకరిది అయితే... నాయకత్వం కోల్పోయిన తర్వాత బ్యాట్స్‌మన్ గా తన అసలు దమ్ము చూపించాల్సిన పరిస్థితి మరొకరిది. తొలి మ్యాచ్‌లో ఇద్దరూ విఫలం కావడంతో సహజంగానే ఒత్తిడి నెలకొంది.
కానీ రెండు మైనస్‌లు కలిస్తే ప్లస్ అయినట్లు ఈ ఇద్దరు జత కలిసి చేసిన పరుగుల కచేరి రికార్డులు కొల్లగొట్టింది. 35 ఏళ్లు దాటిన ఈ ఇద్దరు వెటరన్ ‘కుర్రాళ్ల’ జోరు కొత్త తరానికి కూడా సరికొత్త పాఠంలా కనిపించింది. వన్డే క్రికెట్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విలువ ఏమిటో, అసలు మధ్య ఓవర్లలో ఎలా ఆడాలో యువీ, ధోని చేసి చూపించారు. ధోని, యువరాజ్ అనగానే 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ గుర్తుకొస్తుంది. సుదీర్ఘ కాలం తర్వాతి వీరిద్దరు జోడీగా మరోసారి నాటి మెరుపులు చూపించారు. ఐదు ఓవర్లు కూడా పూర్తి కాక ముందే స్కోరు 25/3... ధోని క్రీజ్‌లో వచ్చే సరికి యువీ ఆడింది మూడు బంతులే. తమ ఫామ్‌ను బట్టి చూస్తే జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్‌ను నిర్మించాలా, ఎదురుదాడికి దిగి దూకుడు ప్రదర్శించాలా అని కాస్త సందిగ్ధం నెలకొన్న పరిస్థితి. అందుకే ఇద్దరూ బాధ్యతలు పంచుకున్నట్లున్నారు.
మొదట్లో వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు ఆడిన ధోని తొలి బౌండరీ కొట్టే లోపు యువరాజ్ 6 ఫోర్లు బాదేశాడు. ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీ పడి సాగించిన ఈ పరుగుల ప్రయాణంలో యువీ ముందుకు దూసుకుపోయాడు. వన్డే జట్టులోకి తన స్థానమే ప్రశ్నార్ధకమైన సమయంలో తిరిగి వచ్చి సెంచరీ చేసిన తర్వాత యువరాజ్ మొహంలో అన్ని రకాల భావాలు కనిపించాయి. ఆనందంతో పాటు సన్నటి కన్నీటి తెర, బ్యాట్ హ్యాండిల్‌తో తన గుండెల మీద బలంగా కొట్టి చూపించడం... యువీ దృష్టిలో ఈ శతకం విలువేమిటో ప్రదర్శించాయి. అటువైపు కూడా ఏమాత్రం తగ్గని ధోని, తనకే సాధ్యమైన రీతిలో సిక్సర్ల మోత మోగించాడు.
యువీ, ధోనికి ముందు గతంలో దిల్షాన్, సంగక్కర (రెండు సార్లు) మాత్రమే 35 ఏళ్లు దాటిన వయసులో ఒకే ఇన్నింగ్స్‌లో శతకాలు సాధించారు. తమ సెంచరీలు పూర్తయిన క్షణాల్లో వీరిద్దరు పరస్పరం అభినందించుకున్న తీరు, సెంచరీ సాధించింది నువై్వనా ఆనందం నాది కూడా అన్నట్లుగా వారి మధ్య ఉన్న ఆత్మీయతను చూపించింది. బయట ఎలాంటి ప్రచారం ఉన్నా... జట్టుకు సంబంధించి మాత్రం ఈ ఇద్దరు సూపర్ స్టార్ల భాగస్వామ్యాన్ని భారత అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
వన్డేల్లో ధోని, యువరాజ్ కలిసి 64 ఇన్నిగ్స్ లలో 53.52 సగటుతో 3,051 పరుగులు జోడించారు.
ఇందులో 10 సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. ఈ పదిసార్లూ భారత్ గెలుపొందడం విశేషం.