ధనాధన్ రాజసం
► యువరాజ్, ధోని సెంచరీలు
► రెండో వన్డేలోనూ భారత్ విజయం
► 2–0తో సిరీస్ సొంతం
► 15 పరుగులతో ఓడిన ఇంగ్లండ్
► చివరి మ్యాచ్ ఆదివారం
వెట‘రన్స్’ జుగల్‌బందీ
మారింది కాలమే కానీ తన ఆట కాదని పునరాగమనంలో నిరూపించుకోవాల్సిన ఆటగాడు ఒకవైపు... నాయకత్వ భారం తొలగినా ఆటగాడిగా బాధ్యతను మరచిపోలేదని చూపించాల్సిన ఆటగాడు మరోవైపు... పరస్పర ప్రోత్సాహం, అభినందనలతో సాగించిన ‘జుగల్‌బందీ’ ప్రత్యర్థికి సినిమా చూపించింది. ధాటిగా, దీటుగా, కనువిందుగా దూసుకుపోయిన యువరాజ్, ధోని ద్వయం పరుగుల ప్రవాహం భారత అభిమానులకు అంతులేని ఆనందాన్ని పంచింది. భారీ సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించిన ఈ జంట మరో మధుర విజయాన్ని మనకు అందించింది. సెంచరీలతో చెలరేగిన వీరిద్దరూ తమ విలువను మరోసారి ఘనంగా చాటడంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ భారత్ వశమైంది.
నువ్వు ఫోర్ బాదితే నేను సిక్సర్‌తో బదులిస్తా... నువ్వు బంతిని డ్రైవ్ చేస్తే, నేను ఆకాశపు అంచుల్లోకి కొడతా... ఇలా ఒకరితో మరొకరు పోటీపడుతూ యువరాజ్, ధోని పారించిన పరుగుల వరదలో ఇంగ్లండ్ కొట్టుకుపోయింది. 38.2 ఓవర్ల పాటు వీరిద్దరు సాగించిన వీర విధ్వంసానికి బారాబతి మైదానం దద్దరిల్లింది. ఈ ఇద్దరు సీనియర్ల ఆట కటక్‌లో మరో అద్భుతాన్ని చూపించింది. మూడేళ్ల తర్వాత వచ్చినా, తన బ్యాటింగ్‌లో రాజసం ఏ మాత్రం తగ్గలేదని అత్యధిక స్కోరు కొట్టి మరీ యువీ నిరూపించగా... నాయకత్వం వదిలేస్తే తాను పాత ధనాధన్ ధోనినే అని మాజీ కెప్టెన్ ఢంకా బజాయించి చెప్పాడు.
ఓపెనర్లు మరోసారి విఫలం కాగా తనకు అలవాటు లేని రీతిలో కోహ్లి కూడా తొందరగానే పెవిలియన్ చేరాడు... కానీ మేమున్నామంటూ యువరాజ్, ధోని నిలబడ్డారు. ఒక్కో పరుగు జోడిస్తూ ఇన్నింగ్స్ ను నడిపించి ఆ తర్వాత వేగంగా దూసుకుపోయారు. సిరీస్‌కు ముందు తామిద్దరిపై కొత్త కెప్టెన్ ఉంచి నమ్మకాన్ని నిలబెడుతూ సెంచరీలతో చిరస్మరణీయ విజయానికి బాటలు వేశారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు ఏకంగా 256 పరుగులు జోడించారు. మోర్గాన్ సెంచరీతో ఛేదనలో ఇంగ్లండ్ చివరి వరకు పోరాడినా... మరో మ్యాచ్‌కు ముందే టెస్టులలాగే కోహ్లి సేన వన్డే సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకుంది.
కటక్: భారత క్రికెట్‌కు మరో అద్భుత విజయం... తొలి పోరులో 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఈ సారి అంతకంటే భారీ స్కోరు సాధించి ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. గురువారం ఇక్కడ భారీ స్కోర్లు నమోదైన రెండో వన్డేలో భారత్ 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (127 బంతుల్లో 150; 21 ఫోర్లు, 3 సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోని (122 బంతుల్లో 134; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు.
అనంతరం ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 366 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్ (81 బంతుల్లో 102; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించగా, జేసన్ రాయ్ (73 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), మొయిన్ అలీ (43 బంతుల్లో 55; 6 ఫోర్లు), జో రూట్ (55 బంతుల్లో 54; 8 ఫోర్లు) రాణించారు. యువరాజ్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. చివరి వన్డే ఈ నెల 22న కోల్‌కతాలో జరుగుతుంది.
4.4 ఓవర్లలోనే...
బౌండరీతో ప్రారంభమైన భారత ఇన్నింగ్స్ ను వోక్స్ దెబ్బ తీశాడు. తన రెండో ఓవర్ తొలి బంతికే రాహుల్ (5)ను అవుట్ చేసిన వోక్స్, చివరి బంతికి స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లి (8)ని కూడా పెవిలియన్ పంపించాడు. మరుసటి ఓవర్లో ధావన్ (11)ను వోక్స్ బౌల్డ్ చేయడంతో భారత్ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
సూపర్ భాగస్వామ్యం: ఈ దశలో జత కలిసిన యువరాజ్, ధోని ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా, ఆ తర్వాత వీరిద్దరు చెలరేగారు. చక్కటి టైమింగ్‌తో డ్రైవ్‌లు ఆడి యువీ పరుగులు రాబట్టగా, ధోని తనదైన శైలిలో ధనాధన్ ఆటతీరు ప్రదర్శించాడు. ఆరంభంలో వోక్స్ బౌలింగ్‌లో వరుసగా 14 బంతుల పాటు ఒక్క పరుగు కూడా తీయలేకపోయిన మాజీ కెప్టెన్ , అటుపై తన జోరును చూపించాడు. బాల్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించిన యువరాజ్ 56 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధోని 68 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు.
ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ చేసిన ప్రయత్నం వృథా అయింది. ప్లంకెట్ బౌలిం గ్‌లో సింగిల్ తీయడంతో యువరాజ్ సెంచరీ పూర్తయింది. శతకం తర్వాత ధాటిని పెంచిన యువీ మరో 28 బంతుల్లోనే 150 పరుగులకు చేరుకున్నాడు. వోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో సింగిల్ తీసి ధోని సెంచరీని అందుకోగా...మరుసటి బంతికే యువీ అవుటయ్యాడు.
చివర్లో మెరుపులు: గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన కేదార్ జాదవ్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) ఈసారి కూడా కొన్ని మెరుపు షాట్‌లు ఆడి ధోనికి అండగా నిలిచాడు. ప్లంకెట్ వేసిన 48వ ఓవర్లో మూడు భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన ఎమ్మెస్, అదే ఓవర్ చివరి బంతికి వెనుదిరిగాడు. ఆఖర్లో పాండ్యా (19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మరిన్ని పరుగులు జోడించారు. చివరి 10 ఓవర్లలో భారత్ 120 పరుగులు చేయడం విశేషం.
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఒక దశలో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆరంభంలోనే హేల్స్ (14) వెనుదిరిగినా రాయ్, రూట్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరు 16 ఓవర్లలో రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జత చేశా రు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో స్వీప్ చేయబోయి రూట్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది.
ధోని రివ్యూ సిస్టం...
గత మ్యాచ్‌లో తాను పట్టిన క్యాచ్‌ను అంపైర్ తిరస్కరించినప్పుడు రివ్యూ కోరి సానుకూల ఫలితం పొందిన ధోని తెలివితేటలు ఈ సారి కూడా బాగా పని చేశాయి. వోక్స్ బౌలింగ్‌లో యువీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి కీపర్ బట్లర్ చేతుల్లో పడింది. అంపైర్ అనిల్ చౌదరి దీనిని అవుట్‌గా ప్రకటించారు. అయితే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ధోని వెంటనే రివ్యూ కోరమంటూ యువీకి సైగ చేశాడు. రీప్లేలో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లక ముందు నేలకు తాకిందని తేలింది. మరోసారి ధోని నిర్ణయం సరైందని తేలడంతో దీనిని సైగలతో చూపిస్తూ పెవిలియన్ లో కుంబ్లే, కోహ్లి నవ్వుకున్నారు.
14 యువరాజ్ కెరీర్‌లో ఇది 14వ సెంచరీ. 2011 ప్రపంచ కప్ తర్వాత అతను సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఆ టోర్నీ ముగిసిన తర్వాత ఆడిన 17 ఇన్నింగ్స్‌లో యువీ 2 అర్ధసెంచరీలు మాత్రమే చేయగలిగాడు.
10 ధోని కెరీర్‌లో ఇది పదో సెంచరీ.
2 వన్డేల్లో నాలుగో వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ (256) భాగస్వామ్యం. అగ్రస్థానంలో అజహర్, జడేజా (275) పార్ట్‌నర్‌షిప్ ఉంది. 1998లో ఇదే మైదానంలో ఆ రికార్డు నమోదైంది.
10 యువీ, ధోని కలిసి ఒక ఇన్నింగ్స్ లో వందకు పైగా పరుగులు జోడించడం ఇది పదోసారి.
203 ధోని కొట్టిన సిక్సర్ల సంఖ్య. వన్డేల్లో 200కుపైగా సిక్స్‌లు బాదిన ఐదో ఆటగాడు ధోని.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) స్టోక్స్ (బి) వోక్స్ 5; ధావన్ (బి) వోక్స్ 11; కోహ్లి (సి) స్టోక్స్ (బి) వోక్స్ 8; యువరాజ్ (సి) బట్లర్ (బి) వోక్స్ 150; ధోని (సి) విల్లీ (బి) ప్లంకెట్ 134; జాదవ్ (సి) బాల్ (బి) ప్లంకెట్ 22; పాండ్యా (నాటౌట్) 19; జడేజా (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 381.
వికెట్ల పతనం: 1–14; 2–22; 3–25; 4–281; 5–323; 6–358.
బౌలింగ్: వోక్స్ 10–3–60–4; విల్లీ 5–0–32–0; ప్లంకెట్ 10–1–91–2, బాల్ 10–0–80–0; స్టోక్స్ 9–0–79–0; అలీ 6–0–33–0.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) జడేజా 82; హేల్స్ (సి) ధోని (బి) బుమ్రా 14; రూట్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 54; మోర్గా¯ŒS (రనౌట్) 102; స్టోక్స్ (బి) అశ్విన్ 1; బట్లర్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 10; అలీ (బి) భువనేశ్వర్ 55; వోక్స్ (బి) బుమ్రా 5; ప్లంకెట్ (నాటౌట్) 26; విల్లీ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 366.
వికెట్ల పతనం: 1–28; 2–128; 3–170; 4–173; 5–206; 6–299; 7–304; 8–354.
బౌలింగ్: భువనేశ్వర్ 10–1–63–1; బుమ్రా 9–0–81–2; జడేజా 10–0–45–1; పాండ్యా 6–0–60–0; అశ్విన్ 10–0–65–3; జాదవ్ 5–0–45–0.